‘అది బలుపు కాదు వాపు’ అని అనారోగ్యకరమైన ఎదుగుదలను ఎత్తిపొడుస్తూ అంటారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకునే ఫిట్నెస్ ప్రాక్టీస్‌కి ఈ మాట సరిపోతుంది! ఫిట్నెస్ పెంచుకోవాలనే ఆలోచనతో చాలామంది అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెడుతున్నారు. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్టు బరువు అమాంతం తగ్గుతున్నారు. కానీ, ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అధిక బరువు తగ్గితే మంచిదే.
కానీ, దానికీ ఓ పద్ధతుంది. నిపుణుల సూచనలు పాటించకుండా, సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీర అవసరాలను బట్టి ఆహారం తీసుకోవాల్సిందే. దీనికి చేసే పనిని బట్టి కూడా ఆహారం మార్చుకోవాలి. సోషల్ మీడియాలో చూసి, ఆన్లైన్లో చదివిన చిట్కాలు ఆచరిస్తే వేగంగా బరువు తగ్గుతారు. సోషల్ మీడియాలో షేర్ చేసేవాళ్లలో ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ, వాళ్లలో దీర్ఘకాలికమైన సమస్యలు మొదలవుతాయని, కనిపించని ఆ సమస్యలను ముందే తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
కొద్ది రోజుల్లోనే బరువు తగ్గేలా డైట్, వర్కవుట్స్ ప్లాన్ చేసినవాళ్లలో బరువే కాదు కండరాల బలమూ తగ్గుతుందట. వారిలో ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా అమాంతం బరువు తగ్గిన వారిని నీరసం, కండరాల క్షీణత, సార్కోపేనియా సమస్యలు వేధిస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటి వెనుకే ఐరన్, విటమిన్ బి12, మెగ్నీషియం, జింక్ లోపాలూ వస్తాయట. ఇవన్నీ కలిసి మనిషిని మంచానికి పరిమితం చేస్తాయని మరిచిపోవద్దు. కాబట్టి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌ని లెక్కగట్టి తినకుండా, ముందుగా వైద్యులు ఏం చెబుతారో తెలుసుకొని ఆచరణలో పెట్టాలి.