Unripe Tamarind Fruit | చింత పండను మనం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. పప్పు, చారు, సాంబార్ వంటి వంటలతోపాటు పులిహోర, స్వీట్లు, పులసు వంటి వంటల్లోనూ చింత పండును వేస్తుంటారు. ఇది చాలా పుల్లగా ఉంటుంది కనుక వంటల్లో వేసి పులుపు కోసం ఉపయోగిస్తుంటారు. చింత పండును వేస్తే వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే మీకు తెలుసా..? చింత పండు కన్నా చింత కాయల్లోనే అధిక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు చింతకాయల్లో ఉంటాయి. చింతపండు కన్నా చింతకాయలను ఉపయోగిస్తేనే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చింత కాయలను నేరుగా తినలేరు. కానీ వీటిని వంటల్లో ఉపయోగించవచ్చు. వీటితో పచ్చడి, సూప్. కూరలు, పులిహోర వంటివి చేసి తినవచ్చు. దీంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
చింతపండులో కన్నా చింతకాయల్లోనే విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల చింత పండు కాస్త తియ్యగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కాయ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. అందుకు అందులో ఉండే విటమిన్ సి నే కారణం అని చెప్పవచ్చు. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. మహిళలకు చింతకాయలు ఎంతగానో మేలు చేస్తాయి. అందుకనే గర్భంతో ఉన్న మహిళలను చింతకాయలు తినాలని చెబుతుంటారు. వారికి కూడా ఆ సమయంలో పుల్లగా ఏమైనా తినాలని అనిపిస్తుంది. అందువల్ల ఆ సమయంలో చింతకాయలను తింటే మేలు జరుగుతుంది.
చింతకాయలను తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. చింత పండులో ఇది తక్కువగా ఉంటుంది. చింతకాయలను తింటే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. చింతకాయల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. చింతకాయలు సహజసిద్ధమైన లాక్సేటివ్గా కూడా పనిచేస్తాయి. ఎంతటి తీవ్ర మలబద్దకాన్ని అయినా సరే తగ్గిస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. చింతకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చింత పండు కన్నా ఆకుపచ్చ రంగులో ఉండే కాయల్లోనే అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాయ పండుగా మారే కొద్దీ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల శాతం తగ్గుతుంది. చింతకాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
చింతకాయల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. చింతకాయల్లో ఉండే సమ్మేళనాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఈ కాయల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు షుగర్‌ను నియంత్రిస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ కాయల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. చింతకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను సంరక్షిస్తాయి. ఈ కాయల్లో ప్రొ సయనైడిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే వ్యర్థాలను బయటకు పంపి లివర్‌ను క్లీన్ చేస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా చింతకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొందరికి ఈ కాయలను తింటే గ్యాస్ సమస్య రావచ్చు. అలాంటి వారు చింతకాయలకు దూరంగా ఉండాలి.