Red Radish | మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది మనకు తెలుపు, ఎరుపు రెండు రంగుల్లో లభిస్తుంది. సాధారణంగా చాలా మంది తెలుపు రంగు ముల్లంగిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఎరుపు రంగు ముల్లంగి కూడా మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఎరుపు రంగు ముల్లంగినే గ్లోబ్ రాడిష్ అని కూడా పిలుస్తారు. ఇది చూసేందుకు పింక్ రంగులోనూ కనిపిస్తుంది. మిరియాల వంటి ఘాటు రుచిని, క్రిస్పీ గుజ్జును కలిగి ఉంటుంది. ఎరుపు రంగు ముల్లంగి మనకు అనేక పోషకాలను అందిస్తుంది. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఎరుపు రంగు ముల్లంగి కూడా ఘాటుగానే ఉంటుంది కనుక దీన్ని రోజూ నేరుగా తినడం ఇబ్బందిగా ఉంటుంది. కనుక దీన్ని రోజూ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఎరుపు రంగు ముల్లంగిలో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. పేగుల్లోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఎరుపు రంగు ముల్లంగిలో చాలా స్వల్ప మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ ముల్లంగిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇలా ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. అలాగే ఈ ముల్లంగి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే లివర్ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. పైత్య రసాల ఉత్పత్తి మెరుగు పడుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కొవ్వులు సులభంగా జీర్ణం అవుతాయి. పిత్తాశయం ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఎరుపు రంగు ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. వీటి వల్లే ముల్లంగి ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఆంథో సయనిన్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా రక్త నాళాల వాపులు తగ్గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఈ ముల్లంగిలో విటమిన్ సి కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ముల్లంగిలో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్త నాళాలను వెడల్పుగా చేసి ప్రశాంతంగా మారుస్తుంది. శరీరంలోని సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. రోజూ వీటి జ్యూస్‌ను తాగుతుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎరుపు రంగు ముల్లంగి సహజసిద్ధమైన డై యురెటిక్గా పనిచేస్తుంది. శరీరంలో అధికంగా ఉండే ద్రవాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల అధికంగా నీరు చేరగా వచ్చే వాపులు తగ్గిపోతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. మూత్రం జారీలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. మూత్రాశయ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పాదాల వాపులు తగ్గిపోతాయి. ఇలా ఎరుపు రంగు ముల్లంగి మనకు అనేక లాభాలను అందిస్తుంది. దీన్ని రోజూ నేరుగా తినవచ్చు. లేదా ఇతర కూరగాయలతో కలిపి సలాడ్‌లా చేసి తినవచ్చు. ఘాటుగా ఉందనుకుంటే మీద కాస్త ఉప్పు చల్లి, నిమ్మరసం పిండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఎరుపు రంగు ముల్లంగిని ఉడకబెట్టకుండా పచ్చిగా తింటేనే అందులో ఉండే పోషకాలను అధిక మొత్తంలో మనం పొందవచ్చు. ఈ విధంగా దీంతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.