Papaya Leaves | ప్రతి ఏడాది లాగా కాకుండా ఈసారి కాస్త ముందుగానే వర్షాకాలం సీజన్ వచ్చింది. ప్రతి ఏడాది జూన్ 3వ వారంలో ఈ సీజన్ మొదలవుతుంది. కానీ మే నెల చివరి వారంలోనే అనూహ్యంగా నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. దీంతో వాతావరణం చల్లబడింది. వేసవి తాపం నుంచి ఉపశనం లభించింది. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ సీజన్ మారినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ సీజన్లో దోమలు విజృంభిస్తాయి. దీంతో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు కూడా ప్రబలుతుంటాయి. అయితే ఈ సీజన్ లో మన ఆరోగ్యం సురక్షితంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాల్సి ఉంటుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందుకు బొప్పాయి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.
బొప్పాయి ఆకుల పేరు చెప్పగానే అందరికీ డెంగీ జ్వరానికి సంబంధించిన ప్లేట్లెట్ల విషయమే గుర్తుకు వస్తుంది. డెంగీ వచ్చిన వారిలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో బొప్పాయి ఆకుల రసం సేవించాలని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్లేట్లెట్ల సంఖ్య పెరిగి త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు. అయితే బొప్పాయి ఆకులు కేవలం ఇందుకే కాదు, ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూస్‌ను సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకుల జ్యూస్‌లో పపైన్, కైమోపపైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. కనుక అజీర్తి ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం జీర్ణమై అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
జీర్ణాశయంలో అల్సర్లు ఉన్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. మలబద్దకం ఉన్నవారికి కూడా ఈ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకుల్లో పపైన్తోపాటు ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. అందువల్ల బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు ఉన్నవారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఆయా సమస్యలను వెంటనే తగ్గించుకోవచ్చు. ఈ ఆకుల రసాన్ని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని పలువురు సైంటిస్టులు జంతువులపై చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. బొప్పాయి ఆకుల రసాన్ని సేవిస్తుంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. దీన్ని శరీరం సక్రమంగా వినియోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
బొప్పాయి ఆకుల్లో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. బొప్పాయి ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. బొప్పాయి ఆకుల పేస్ట్‌ను జుట్టుకు నేరుగా అప్లై చేయవచ్చు. దీంతో చుండ్రు, దురద, జుట్టు రాలడం తగ్గిపోతాయి. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా బొప్పాయి ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకు 2 సార్లు, పావు టీస్పూన్ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు వచ్చి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీలు ఉన్నవారు ఈ జ్యూస్‌ను సేవించకూడదు.