Trikatu Churnam | మనకు తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు మన ఇంట్లోనే ఉండే పలు పదార్థాలు పనిచేస్తాయి. అందుకు గాను ఇంగ్లిష్ మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే కొన్ని ఆయుర్వేద మూలికలను కూడా ఇంట్లో తయారుగా ఉంచుకుంటే ఇంకా ఎంతో ఫలితం ఉంటుంది. అలాంటి మూలికల్లో శొంఠి, పిప్పళ్లు, మిరియాలు మొదటి స్థానంలో నిలుస్తాయని చెప్పవచ్చు. ఇవి మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు వెలకట్టలేనివని చెప్పవచ్చు. అయితే ఈ మూడింటినీ విడివిడిగా కాకుండా అన్నింటినీ చూర్ణంగా చేసి కలిపి కూడా నిల్వ చేసుకోవచ్చు. దీన్నే త్రికటు చూర్ణం అని కూడా పిలుస్తారు. ఈ మూడు మూలికలను పొడిగా చేసి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేయాలి. దీన్ని త్రికటు చూర్ణంగా చెబుతారు. అయితే ఈ త్రికటు చూర్ణం మనకు అనేక లాభాలను అందిస్తుంది. దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
త్రికటు చూర్ణాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లేదా సమయం లేదని భావిస్తే మనకు మార్కెట్లోనూ ఇది ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తుంది. దాన్ని కూడా కొని తెచ్చి ఉపయోగించవచ్చు. కానీ వీలైతే ఇంట్లోనే సహజసిద్ధంగా దీన్ని తయారు చేసుకోవడం మంచిది. ఇక ఈ చూర్ణం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులు నయం అవుతాయి. దీన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో నిల్వ చేసుకోవాలి. త్రికటు చూర్ణం మూడు భాగాలు, ఒక భాగం వాము, యాలకులు, ఉప్పు, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణం తీసుకుని అన్నింటినీ కలపాలి. అందులో కాసీ భస్మం కలపాలి. తగినంత నిమ్మరసం పోసి ఎండలో ఎండబెట్టాలి. తరువాత చూర్ణం చేసి ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ చొప్పున సేవించాలి. కడుపునొప్పి, అగ్ని మాంద్యం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే త్రికటు చూర్ణం, త్రిఫల చూర్ణం, తగినంత సైంధవ లవణం కలిపి రోజుకు రెండు సార్లు అరటీస్పూన్ చొప్పున తీసుకోవాలి. పొడిదగ్గు, కళ్లె దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
త్రికటు చూర్ణం మూడు భాగాలు, వాము, సైంధవ లవణం, జీలకర్ర, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణాలను ఒక్కొక్క భాగం వంతున కలిపి భోజనం మొదటి ముద్దలో కలిపి తింటుండాలి. దీని వల్ల కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, త్రేన్పులు, విరేచనాలు తగ్గుతాయి. అన్ని రకాల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే రోజుకు ఒకసారి అరగ్లాస్ వేడి నీటిలో ముప్పాతిక స్పూన్ త్రికటు చూర్ణం, పావు స్పూన్ జీలకర్ర చూర్ణం, ఒక టీస్పూన్ ఉప్పు కలిపి తగినంత నిమ్మరసం కలిపి తాగుతుంటే కడుపు నొప్పి, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు, మలబద్దకం, అగ్ని మాంద్యం, అజీర్ణం, అరుచి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
రెండు గరువింద గింజల ఎత్తు త్రికటు చూర్ణాన్ని పరిశుభ్రమైన నీటిలో కలిపి వడగట్టి నాలుగైదు చుక్కల వంతున ముక్కు రంధ్రాల్లో వేసుకుంటుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తలబరువు, సైనస్, కంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా ఒక భాగం జాజికాయ, లవంగాల చూర్ణాలను, మూడు భాగాల త్రికటుచూర్ణం, త్రిఫల చూర్ణాలకు కలిపి ఇందులో శుద్ధ లోహ భస్మాన్ని తొమ్మిది భాగాలు కలిపి ఉంచుకుని, ఐదారు చిటికెల వంతున రోజుకు రెండు సార్లు తేనెతో కలిపి తీసుకుంటే రక్తవృద్ధి జరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇలా త్రికటు చూర్ణం మనకు ఎంతో మేలు చేస్తుంది. అయితే భస్మాలను వాడితే ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది.