Ginger | వంటగదిలో మనం వాడే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. దాదాపు మనం తయారు చేసే అన్ని రకాల వంటకాల్లో అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో, స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పిని తగ్గించడంలో, వాపులను తగ్గించడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా అల్లం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే అల్లం మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిని వాడే విషయంలో తప్పులు చేయడం వల్ల అల్లం వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందలేం. అల్లాన్ని తీసుకునే విషయంలో మనం చేస్తున్న ప్రధాన తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లాన్ని ఎక్కువ సేపు ఉడికించడమనేది మనం చేస్తున్న పెద్ద తప్పు. అల్లాన్ని ముదురు రంగు వచ్చే వరకు వేయించడం వల్ల దానిలో ఉండే సహజ సమ్మేళనాలు విచ్చిన్నం అవుతాయి. దీంతో పాటుగా దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కూడా తగ్గుతాయి. అల్లాన్ని కొద్దిగా వేయించడం లేదా వంట చివర్లో వేయడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అల్లాన్ని తక్కువగా వేయించడం వల్ల దాని రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే ఒకే సమయంలో ఎక్కువ అల్లాన్ని వాడడం వల్ల కూడా మనం తగిన ప్రయోజనాలను పొందలేం. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, కడుపులో అసౌకర్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక వంటల్లో తక్కువ మొత్తంలో అల్లాన్ని వాడాలి. తక్కువ మోతాదులో అల్లాన్ని తీసుకున్నప్పుడే జీర్ణక్రియకు మేలు కలుగుతుంది.
అలాగే చాలా మంది పాత అల్లాన్ని, ఎండిన అల్లాన్ని కూడా వాడుతూ ఉంటారు. పాత అల్లం కంటే తాజా అల్లమే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎండిన అల్లంలో రుచితో పాటు, వాసన, పోషకాలు కూడా తగ్గుతాయి. కనుక తాజా అల్లాన్నే ఎక్కువగా ఉపయోగించాలి. అల్లాన్ని సరిగ్గా నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. అలాగే మనం అల్లంపై ఉండే తొక్కను తొలగించిన తరువాతే వాడుతూ ఉంటాము. కానీ వీలైనంత వరకు అల్లాన్ని తొక్కతో సహా ఉపయోగించాలి. అల్లం తొక్కలో రుచి, వాసనతో పాటు ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం తొక్క తీయడానికి కత్తికి బదులుగా చెంచా ఉపయోగించడం వల్ల వ్యర్థాలు, పోషకాలు ఎక్కువగా తొలగిపోకుండా ఉంటాయి.
ఇక వంటల్లో అల్లాన్ని వేయగానే దాని రుచి, వాసన రెండూ మారిపోతాయి. కనుక వంట మొదట్లోనే అల్లాన్నివేసి కొద్దిగా వేయించాలి లేదా వంట పూర్తి చేసే ముందు తాజాదనం కోసం కొద్దిగా చల్లుకోవాలి. కానీ ఎటూకాని సమయంలో అల్లం ముద్ద వేయడం వల్ల అది కఠినంగా మారడంతో పాటు వంట రుచి కూడా పోతుంది. కనుక వంటల్లో అల్లాన్ని సరైన సమయంలో వేయడం తెలిసి ఉండాలి. ఈ విధంగా మనలో చాలా మంది అల్లాన్ని తీసుకునే విషయంలో తప్పులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకునే సరైన పద్దతులు తెలిసినప్పుడే మనం దాని వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు.