ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినాలంటే చాలా మందికి నాన్ వెజ్ ఫుడ్స్ గుర్తుకు వస్తాయి. కేవలం మాంసాహారం తింటేనే మనకు ప్రోటీన్లు లభిస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. మనకు అందుబాటులో ఉన్న శాకాహార పదార్థాల్లోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఫుడ్స్ శాకాహారులకు గొప్ప వరమనే చెప్పవచ్చు. ఆమాటకొస్తే ఈ ఆహారాలను ఎవరైనా తినవచ్చు. తరచూ చికెన్, మటన్, ఫిష్‌ను ధర పెట్టి తినేకంటే ఈ వెజిటేరియన్ ఫుడ్స్‌ను చాలా తక్కువ ధరకే తినవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభించడమే కాదు, మన శరీరానికి శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆ వెజిటేరియన్ ఫుడ్స్ ఏమిటంటే..
పచ్చి బఠానీలను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. అయితే వాస్తవానికి ప్రోటీన్లు వీటిల్లో అధికంగా ఉంటాయి. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు ఏకంగా 8.7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి ధర కూడా తక్కువే. చికెన్, మటన్ తినేకన్నా రోజూ ఒక కప్పు వీటిని తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇక పచ్చి బఠానీల్లో విటమిన్లు ఎ, సి, కె కూడా అధికంగానే ఉంటాయి. విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ కె మనకు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. ఇలా పచ్చి బఠానీలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పాలకూర అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీంతో పప్పు లేదా నేరుగా కూర, పచ్చడి చేసుకోవచ్చు. చిన్నారులకు, గర్భిణీలకు దీన్ని ఎక్కువగా పెడుతుంటారు. క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి కనుక వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అయితే పాలకూరలోనూ ప్రోటీన్లు సమృద్ధిగానే ఉంటాయి. ఒక కప్పు ఉడకబెట్టిన పాలకూరను తింటే మనకు సుమారుగా 5.3 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. పాలకూరను మీరు సలాడ్స్, స్మూతీలు వంటి వాటిలో వేసి కూడా తినవచ్చు. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
పుట్ట గొడుగులను శాకాహారులకు వరమనే చెప్పవచ్చు. వీటిల్లోనూ ప్రోటీన్లు మనకు అధికంగానే లభిస్తాయి. ఒక కప్పు ఉడకబెట్టిన పుట్టగొడుగులను తింటే మనకు సుమారుగా 4 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి మనకు ప్రస్తుతం ఎక్కడైనా అందుబాటులో ఉంటున్నాయి. ఏడాది పొడవునా లభిస్తాయి. కనుక వీటిని తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. ఇక ఇవే కాకుండా మనకు స్వీట్ కార్న్, బ్రోకలీ, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, పెసలు, పప్పు దినుసులు, క్యారెట్ వంటి ఆహారాల్లోనూ ప్రోటీన్లు సమృద్దిగా లభిస్తాయి. కనుక వీటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు మనకు శక్తిని అందించడమే కాకుండా కండరాల మరమ్మత్తులకు, నిర్మాణానికి పనిచేస్తాయి. ఇలా ప్రోటీన్లు కలిగిన ఫుడ్స్‌ను తింటూ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.