ట్రెమర్స్… అంటే కాళ్లు, చేతుల్లో వణుకు రావడం. ఇదొక దీర్ఘకాలిక సమస్య. దీనికి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లేదు. కొన్ని రకాల మందులతో చికిత్స చేస్తారు. దీంతో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కొన్నిసార్లు ఆ చికిత్సతో దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అయితే, కాలంతోపాటు మార్పు చెందుతున్న వైద్యరంగంలో ట్రెమర్స్కు చెక్ పెట్టేందుకు ఓ అత్యాధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్’. సాధారణంగా ఎంఆర్ఐ స్కానింగ్‌తో రోగాన్ని కచ్చితంగా గుర్తించి, నిర్ధారిస్తారు. కానీ, ఎంఆర్ గైడెడ్ పద్ధతిలో వినియోగించే ఎంఆర్ఐతో చికిత్స కూడా చేస్తారు. అదే దీని ప్రత్యేకత.
ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ పద్ధతిలో చికిత్స మనదేశంలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకటి తమిళనాడులోని ఒక హస్పిటల్ కాగా, రెండోది హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్. ఈ నేపథ్యంలో అసలు వణుకుడు వ్యాధి అంటే ఏంటి, ఎందుకు, ఎలా వస్తుంది, పాత చికిత్సా పద్ధతులకు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్కు మధ్య ఉన్న తేడా ఏంటి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ట్రెమర్స్ అంటే వణుకు రావడం. వణుకుడుకు సంబంధించి ప్రధానంగా రెండు రకాల జబ్బులు ఉన్నాయి.
1. ఎసెన్షియల్ ట్రెమర్,
2. ట్రెమర్ డామినెంట్ పార్కిన్సన్. ఈ వ్యాధులతో బాధపడే రోగులకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్‌తో మంచి ఫలితాలు ఉంటాయి. వీటికి గతంలో ఉన్న చికిత్స కంటే ఇది చాలా కచ్చితమైన, సత్వర ఉపశమనం కలిగిస్తుంది.
ఇది జన్యుపరం (జెనెటికల్)గా వచ్చే సమస్య. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉంటే వంశపారంపర్యంగా ఇతర కుటుంబసభ్యులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ ట్రెమర్ అనేది 20 నుంచి 60 ఏళ్ల వయసులో ఎప్పుడైనా రావచ్చు.
యాభై ఏళ్లు పైబడిన వారిలో పార్కిన్సన్ వ్యాధి సర్వసాధారణం. ఇది మూడు రకాలు..
1. ట్రెమర్ డామినెంట్, 2. ఎకైనటిక్ రిజిడ్టైప్, 3. పీఐజీడీ (పోస్చరల్ ఇన్‌స్టెబిలిటీ గేయిట్ డిజార్డర్). వీటిలో ప్రస్తుతం ట్రెమర్ డామినెంట్ రకానికి మాత్రమే ఎంఆర్ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.
మెదడులో సబ్‌స్టాన్షియా నైగ్రా అనే భాగంలో డోపమైన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య సర్వసాధారణం. ఇది కాకుండా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం, పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్), గుండె సమస్యలు ఉన్నవారితోపాటు వ్యవసాయంలో రసాయన పురుగుమందులకు (పెస్టిసైడ్స్) గురయ్యేవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
ఎకైనటిక్ బాధితుల్లో వణుకు అనేది ఎక్కువగా ఉండదు. ఇందులో స్టిఫ్నెస్, స్లోనెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా శరీరంలో ఏదైనా ఒకవైపున మొదలవుతుంది. దీనివల్ల కాళ్లు చేతులు ఆడించలేరు. అంతేకాకుండా కీళ్లనొప్పులు వస్తాయి. దీంతో చాలామంది రోగులు కీళ్ల వైద్యుల దగ్గరికి వెళ్తారు. కానీ అది కీళ్ల సమస్య కాదు.
ఇందులో శరీరం బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోవడం, నడక మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని కూడా లక్షణాల ఆధారంగానే గుర్తిస్తారు. అయితే, ఈ మూడు రకాల సమస్యలకు దాదాపుగా ఒకే రకమైన చికిత్స ఇస్తారు. చికిత్సలో భాగంగా డాక్టర్లు లివోడోపా, ప్రామిపెక్సోల్ వంటి మాత్రలు సూచిస్తారు. కాకపోతే, ఈ చికిత్స వల్ల మొదటి దశలో 5-6 గంటలపాటు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత సమస్య మళ్లీ మొదలవుతుంది.
వణుకుడు రోగులకు మెదడులో కొన్ని కణాలు అతి క్రియాశీలకం (హైపర్ యాక్టివ్)గా మారుతాయి. దీంతో కాళ్లు లేదా చేతుల్లో వణుకు వస్తుంది. ఈ హైపర్ యాక్టివ్ కణాలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. దీనికోసం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీ చేస్తారు. ఇందులో కపాలానికి రంధ్రం చేసి, మెదడులోకి ఎలక్ట్రోడ్స్ పంపించి, ప్రోగ్రామింగ్ ద్వారా నియంత్రిస్తారు. దీనివల్ల వ్యాధి నియంత్రణలో మాత్రమే ఉంటుంది. డీబీఎస్ ఆపేస్తే మళ్లీ వణుకు వస్తుంది. అయితే, సర్జరీలో కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బ్యాటరీ ఆఫ్ అయితే సమస్య మళ్లీ ఉత్పన్నమవుతుంది. ఎలక్ట్రోడ్ వైర్లు బ్రేక్ అయితే వాటిని మళ్లీ సర్జరీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ జబ్బుకు మందులు అందుబాటులో ఉన్నాయి. మందులు వాడినప్పుడు మాత్రమే 8 నుంచి 10గంటల సమయం వరకు వణుకు తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ సమస్య మొదటికి వస్తుంది.
ఎసెన్షియల్ ట్రెమర్స్, పార్కిన్సన్ వ్యాధికి కోత లేని ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ పద్ధతిలో చేసే చికిత్స మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ పద్ధతిలో రోగికి తలపైన ఫ్రేమ్‌ను అమరుస్తారు. ఆ తర్వాత ఫ్రేమ్‌కు మెంబ్రేన్ అమరుస్తారు. ఎంఆర్ఐ రూమ్‌లో ఎంఆర్ఐ ద్వారా అల్ట్రాసౌండ్ తరంగాలను మెదడులోకి పంపించి హీట్ రీజియన్‌ను సృష్టిస్తారు. దీన్నే వైద్య పరిభాషలో థర్మో అబ్లేషన్ అంటారు. విమ్ న్యూక్లియస్ ఆఫ్ థలామస్ అనే భాగంలో థర్మో అబ్లేషన్ ద్వారా వణుకును తగ్గిస్తారు. దీనికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ చికిత్సలో ఉన్న గొప్పతనం ఏంటంటే చికిత్స పూర్తయిన వెంటనే రోగికి సమస్య తగ్గిపోతుంది. ఈ విధానంలో రోగికి ఎలాంటి మత్తుమందూ ఇవ్వరు. ఎందుకంటే ఇది శస్త్రచికిత్స కాదు. పైగా ఈ పద్ధతిలో రోగి చికిత్స ప్రక్రియను మొత్తం గమనించే వీలుంది. చికిత్స అయిపోయిన మర్నాడే రోగిని డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ లేకుండా చేసే చికిత్స కనుక ఎలాంటి నొప్పీ ఉండదు. రోగి వెంటనే కోలుకుంటాడు.
ఇక ఈ పద్ధతి ద్వారా 100 మందికి చికిత్స చేస్తే 70 మందికి దాదాపు ఐదేళ్ల వరకు మళ్లీ సమస్య ఉత్పన్నం కాదు. మిగిలిన 30 మందిలో సమస్య మళ్లీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆరు నెలల తర్వాత మరోసారి చికిత్స ఇవ్వాలి. మొత్తంగా చూస్తే ఎంఆర్ గైడెడ్ పద్ధతి ద్వారా తక్షణ ఉపశమనం కలగడంతోపాటు బీపీ, షుగర్, గుండె తదితర సమస్యలతో సర్జరీ చేయించుకోలేని రోగులకు ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది.