థైరాయిడ్ మన శరీరంలోని కీలకమైన గ్రంథుల్లో ఒకటి. ఇది మన శరీరంలో చాలా జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది.
అంతేకాదు మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ముఖ్యపాత్ర థైరాయిడ్దే. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయలేని పరిస్థితి వచ్చిందంటే అది మన శరీరం మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం థైరాయిడ్ రుగ్మతలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా తలెత్తే థైరాయిడ్ సమస్యలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ, షుగర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. కానీ, థైరాయిడ్ విషయంలో అలాంటి వెసులుబాటు లేదంటున్నారు వైద్యులు. ప్రజల్లో అవగాహన కొరవడటంతో రోజురోజుకూ థైరాయిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ఈ పరిస్థితుల్లో అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ సమస్యలు, వాటివల్ల కలిగే అనర్థాలు? చికిత్స తదితర అంశాలపట్ల అవగాహన కలిగి ఉండాలి.
థైరాయిడ్… మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ప్రధానమైన గ్రంథి. ఈ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన శరీరం పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎదగడానికి అంటే… మెదడు అభివృద్ధికి, ఎత్తు పెరగడానికి, బాలికల్లో అయితే రజస్వల కావడానికి, స్త్రీలలో నెలసరి, గర్భం దాల్చడం ఇలా వివిధ శరీర జీవక్రియల్లో థైరాయిడ్ గ్రంథిదే కీలకపాత్ర. పిల్లలు ఎత్తు పెరగడం లేదంటే అది థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా లోపం కావచ్చు. బాలికలు రజస్వల కాలేదంటే థైరాయిడ్ సమస్య కావచ్చు. లేదా మహిళలు గర్భం దాల్చడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయంటే అక్కడ కూడా థైరాయిడ్ సమస్యనే ముందుండొచ్చు.
అందుకని గర్భధారణ సమస్యలు వచ్చిన స్త్రీలకు మొట్టమొదటగా థైరాయిడ్ పరీక్షలు చేయిస్తారు. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే లోపాలు లేదా సమస్యలనే థైరాయిడ్ సమస్యలుగా లేదా వాడుక భాషలో థైరాయిడ్ ఉన్నట్టుగా పేర్కొంటారు. ప్రధానంగా థైరాయిడ్‌లో మూడు రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, రెండోది హైపర్‌థైరాయిడిజం, మూడోది థైరాయిడ్ క్యాన్సర్. సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే థైరాయిడ్‌ను నియంత్రణలో ఉంచవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎలాంటి పథ్యం అవసరం ఉండదు. అన్ని రకాల ఆహార పదార్థాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
హైపోథైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి నుంచి వెలువడే హార్మోన్ స్థాయులు రక్తంలో సాధారణం కంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ సమస్యను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లల్లో…
Thyroid
హైపర్‌థైరాయిడిజం
రక్తంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు ఉండటమే హైపర్‌థైరాయిడిజం. అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో హార్మోన్లను స్రవిస్తుందన్నమాట. దీన్ని కూడా రక్త పరీక్ష ద్వారానే నిర్ధారిస్తారు.
అంచనా ఇలా…
సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లను టీ3, టీ4, టీఎస్హెచ్గా పిలుస్తారు. థైరాయిడ్ పనితీరు పరీక్షలు చేసినప్పుడు టీ3, టీ4, టీఎస్‌హెచ్ విలువల ఆధారంగానే రోగికి ఏ రకమైన థైరాయిడ్ ఉందో నిర్ధారిస్తారు. టీ3, టీ4 తక్కువగా ఉండి, టీఎస్‌హెచ్ ఎక్కువగా ఉంటే వారికి హైపోథైరాయిడిజం ఉన్నట్టు నిర్ధారిస్తారు. అదే హైపర్‌థైరాయిడిజం రోగుల్లో అయితే టీ3, టీ4 ఎక్కువగా ఉండి, టీఎస్‌హెచ్ తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉంటే మెడ దగ్గర అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు.
ఇవీ కారణాలు…
ఆటో ఇమ్యూనిటీ అనేది సర్వసాధారణ కారణంగా చెప్పవచ్చు. అంటే మన శరీరం మన కణజాలానికి వ్యతిరేకంగా యాంటిబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతిని, దానినుంచి విడుదలయ్యే హార్మోన్లలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఆ వ్యత్యాసాల ఆధారంగా హైపో లేదా హైపర్‌థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది.
వయసుతో నిమిత్తం లేదు
థైరాయిడ్ సమస్యకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా రావచ్చు. కడుపులో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పరిపక్వత చెందకపోతే ఆ శిశువుకు పుట్టుకతోనే థైరాయిడ్ సమస్య రావచ్చు. నవజాత శిశువుల్లో థైరాయిడ్ లక్షణాలు కనిపించవు. అందుకని పిల్లలు పుట్టిన వెంటనే కచ్చితంగా థైరాయిడ్ పరీక్షలు కూడా చేస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరో విషయం ఏమిటంటే థైరాయిడ్ సమస్య సాధారణంగా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
చికిత్స విధానం
థైరాయిడ్ స్థాయులు, వాటికి సంబంధించిన యాంటిబాడీస్ ఆధారంగా చికిత్స ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ లక్షణాలు ఉండి, టీఎస్‌హెచ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఒక్కసారి థైరాయిడ్ చికిత్స ప్రారంభిస్తే ఇక జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. హైపోథైరాయిడ్, హైపర్‌థైరాయిడ్ రోగులకు చికిత్సా విధానం వేర్వేరుగా ఉంటుంది. హైపోథైరాయిడ్ రోగులకు ‘థైరాక్సిన్’ అనే థైరాయిడ్ హార్మోన్ మాత్ర ఇస్తారు. రోగి రక్తంలో థైరాయిడ్ విలువల ఆధారంగా వైద్యులు మాత్రల డోసు సూచిస్తారు.
కాగా, హైపర్‌థైరాయిడ్ రోగులకు మూడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ మాత్రలు ఇవ్వడం. రెండోది ‘రేడియో అయోడిన్ అబ్లేషన్’ చికిత్స. ఇది చుక్కల మందు రూపంలో ఉంటుంది. ఈ మందు వేయడం వల్ల అధిక పరిమాణంలో ఉన్న థైరాయిడ్ హార్మోన్లు సాధారణ స్థాయికి వస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు వచ్చి పరిమాణం పెరిగినప్పుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే గ్రంథి పరిమాణం పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరికీ సర్జరీ అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స అవసర పడుతుంది.
జాగ్రత్తలు
లక్షణాలు
థైరాయిడ్ క్యాన్సర్
కొంతమందిలో థైరాయిడ్ స్థాయులు సాధారణంగానే ఉంటాయి. కాని థైరాయిడ్ గ్రంథిలో మాత్రం గడ్డలు ఏర్పడతాయి. అవి సాధారణ గడ్డలు కావచ్చు లేదా క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు. అందుకని మెడ దగ్గర వాపులాగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఎండోక్రైనాలజిస్టును సంప్రదించాలి. అతను స్క్రీనింగ్ ద్వారా సమస్యను గుర్తించి, ఒకవేళ అది థైరాయిడ్ క్యాన్సర్ అయితే తగిన చికిత్స సూచిస్తాడు.
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్.బియాట్రిస్ ఆని
ఎండీ, డీఎం(గోల్డ్ మెడల్), ఎస్సీఈ(యూకే)
ఎండోక్రైనాలజి విభాగాధిపతి
నిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్