Healthy Snacks | సాయంత్రం సమయంలో చాలా మంది జంక్ ఫుడ్‌ను అధికంగా తింటుంటారు. బయట బండ్లపై లభించే బజ్జీలు, పునుగులు, సమోసాల వంటి పదార్థాలతోపాటు బేకరీల్లోని ఆహారాలను కూడా లాగించేస్తుంటారు. కొందరు ఫాస్ట్ ఫుడ్ తింటారు. అయితే ఇవన్నీ మన ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే. కానీ తరచూ ఈ ఆహారాలను తినడం శ్రేయస్కరం కాదు. వీటిని తరచూ తింటే అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి. పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సాయంత్రం సమయంలో ఈ అనారోగ్యకరమైన స్నాక్స్‌ను తినకూడదు. మరి ఆకలి అవుతుంది కదా, ఏదైనా ఒకటి తినాలని అనిపిస్తుంది కదా.. అంటే.. అవును, ఆకలి అయితే ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినాలి. వీటి వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొందవచ్చు. ఇక ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖనాల గురించి అందరికీ తెలిసిందే. వీటిని ఆరోగ్యవంతమైన స్నాక్స్ లాగా తినవచ్చు. పెనంపై కాస్త నెయ్యి వేసి ఫూల్ మఖనాలను వేయించి తినవచ్చు. అవసరం అనుకుంటే కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. ఫూల్ మఖనాలను తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా అనేక పోషకాలను పొందవచ్చు.అలాగే మొలకలతో చేసిన సలాడ్‌ను కూడా తినవచ్చు. మొలకల్లో కీరదోస, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలను కలిపి మీద కాస్త మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు చల్లి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
అటుకులతో చేసే పోహా కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పచ్చి బఠానీలు, క్యారెట్లు, ఆలుగడ్డలు వంటివి వేసి పోహా తయారు చేసి తింటే ఎంతో మేలు జరుగుతుంది. అనేక పోషకాలను పొందవచ్చు. ఆకలి కూడా తీరుతుంది. ఇక సాయంత్రం సమయంలో బెల్లం, మరమరాలతో చేసిన లడ్డూలు లేదా నువ్వుల లడ్డూలు, పల్లీ చిక్కిలు, రాగి లడ్డూలు, అవిసె గింజలతో చేసిన లడ్డూలను తినవచ్చు. ఇవి ప్రోటీన్లను సమృద్ధిగా లభించేలా చేస్తాయి. ఆకలిని తీరుస్తాయి. అనేక పోషకాలను మనకు అందిస్తాయి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే నల్ల శనగలను ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం వాటిని ఉడికించి పోపు వేసి గుడాల్లా తయారు చేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. శనగలతోపాటు పెసలు, బొబ్బర్లు వంటి వాటిని కూడా ఇదే విధంగా తినవచ్చు.
పల్లీలను నీటిలో నానబెట్టి తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. సాయంత్రం సమయంలో తినాల్సిన ఆరోగ్యవంతమైన స్నాక్స్ జాబితాలో పల్లీలు ముందు వరుసలో నిలుస్తాయి. నీటిలో నానబెట్టకపోతే పల్లీలను పెనంపై నేరుగా అలాగే కాస్త వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కాస్త బెల్లం ముక్కతో కలిపి తింటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. సాయంత్రం సమయంలో ఓట్స్ తో తయారు చేసిన ఆహారాలను కూడా తినవచ్చు. ఓట్స్ వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇలా ఆయా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను సాయంత్రం సమయంలో తినాలి. వీటి వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. పైగా ఆకలి కూడా తీరుతుంది. ఇవన్నీ ఎంతో రుచిగా కూడా ఉంటాయి.