ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. బరువు అదుపులో ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం అనేది ఓ భాగమైపోయింది. దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తున్నారు. అయితే, డైట్లాగానే వర్కౌట్స్ కూడా ఓ సమయం ఉంటుందట. ఇది మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
ఈ తాజా అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీలో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం పురుషులు, మహిళలకు వర్కౌట్స్ చేసేందుకు వేర్వేరు సమయాలు అనుకూలంగా ఉంటాయి. మహిళలు ఉదయంపూట వర్కౌట్స్ చేస్తే ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారని తేలింది. అలాగే, పురుషులు సాయంత్రం వర్కౌట్స్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. హార్మోన్లలో తేడాలు, నిద్ర, నిద్రలేచే సమయం, జెండర్ జీవగడియారంపై ఈ వర్కౌట్స్ ఫలితాలు ఆధారపడుతాయని పరిశోధకులు తెలిపారు. 25-55 ఏళ్ల మధ్య వయస్సున్న 30 మంది పురుషులు, 26 మంది మహిళలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిని 12 వారాలపాటు పర్యవేక్షించారు. ఇందులో ఒక బృందంతో ఉదయం 8.30 గంటల ముందు ఒక గంటపాటు, ఇతరులతో ప్రత్యేక భోజన ప్రణాళికను అనుసరిస్తూ సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య వ్యాయామం చేయించారు.
వ్యాయామం ప్రారంభ, ముగింపు సమయంలో ఏరోబిక్ శక్తి, బలం, ఫ్లెక్సిబిలిటీతోపాటు రక్తపోటు, శరీరంలో కొవ్వుస్థాయిలను పరిశోధకులు విశ్లేషించారు. సమయంతో సంబంధం లేకుండా 12 వారాల వ్యవధిలో అందరి ఆరోగ్యం మెరుగుపడింది. అయినప్పటికీ మెరుగైన ఆరోగ్యం కోసం పురుషులు, మహిళలకు ఉత్తమ వ్యాయామం సమయం భిన్నంగా ఉంటుందని తేలింది. మహిళలు ఉదయంపూట, పురుషులు సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్తేనే మెరుగైన ఫలితాలుంటాయని పరిశోధకులు గుర్తించారు. కాగా, అప్పర్ బాడీలో కండర బలం పెంచుకోవాలనుకునే, మూడ్లో మార్పు రావాలని కోరుకునే మహిళలు సాయంత్రంపూట వ్యాయామం చేస్తే బెటర్ అని తేల్చారు. పురుషులు సాయంత్రం వ్యాయామం చేస్తే మానసిక ఆరోగ్యం, గుండె జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని గుర్తించారు. తద్వారా గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్, ఊబకాయంలాంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు.