Thati Bellam | మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది మాత్రం రోజూ అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. బేకరీ పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, స్వీట్లను ఎక్కువగా తింటున్నారు. దీని వల్ల రోగాల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను రోజూ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ఇక ప్రకృతి మనకు అందిస్తున్న ఆరోగ్యకరమైన ఆహారాల్లో తాటి బెల్లం కూడా ఒకటి. దీన్ని మనం రహదారుల పక్కన చూడవచ్చు. చాలా మంది తాటిబెల్లాన్ని విక్రయిస్తుంటారు. అయితే తాటి బెల్లంను అది ఉన్న రంగు కారణంగా చాలా మంది ఇష్ట పడరు. కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తాటి బెల్లంను ఇప్పుడే తినడం మొదలు పెడతారు. అన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందిస్తుంది.
తాటిబెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో రక్తం ఎక్కువగా తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి తాటిబెల్లం చక్కని ఆప్షన్ అని చెప్పవచ్చు. రోజువారి ఆహారంలో తాటిబెల్లాన్ని తింటుంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. అలాగే ఇందులో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా నరాల బలహీనత తగ్గుతుంది. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు తాటిబెల్లంను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీంతో కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు.
తాటిబెల్లంలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. తాటిబెల్లంలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. కనుక హైబీపీ ఉన్నవారికి తాటిబెల్లం ఒక వరం అనే చెప్పవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. తాటిబెల్లాన్ని మహిళలు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలో దెబ్బ తిన్న కణజాలానికి మరమ్మత్తులు చేస్తాయి. దీంతో స్త్రీలలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
తాటిబెల్లంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్దకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్‌ను నివారించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే తాటిబెల్లంను తింటే పొడి దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఒక టీస్పూన్ తాటిబెల్లం తినడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువును తగ్గించేందుకు ఈ బెల్లం ఎంతగానో పనిచేస్తుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. కనుక తాటి బెల్లం మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా కొని తెచ్చి వాడండి. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.