సాంకేతిక ప్రగతితో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ రోగాల నివారణలో గణనీయమైన ప్రభావం చూపుతోంది. క్యాన్సర్‌తో బాధ పడే రోగులకే కాకుండా నాన్ క్యాన్సర్ రోగులకు సైతం ఈ విధానం ఉపయోగపడుతోంది. ఈ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఏ రోగులకు చేయవచ్చు? ఈ చికిత్సా పద్ధతులు ఎన్ని రకాలు? మూలకణ చికిత్సతో రోగులకు కలిగే లాభాల గురించి, మూలకణ చికిత్సలో నూతన పద్ధతుల గురించి నేటి ఊపిరిలో తెలుసుకుందాం
పాణాంతకమైన రక్త సంబంధ వ్యాధులతో పోరాడుతున్న రోగులకు ఆశాకిరణం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స. ఒకప్పుడు ప్రాణాలకు ముప్పుగా పరిగణించిన లుకేమియా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వ్యాధులను బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సతో సమర్థవంతంగా అదుపుచేయగలుగుతున్నారు. శరీరంలో రక్త కణాల ఉత్పత్తి దెబ్బతిన్న సందర్భాల్లో, ఆరోగ్యకరమైన స్టెమ్ సెల్స్‌ను ప్రవేశపెట్టి కొత్త జీవకణాల సృష్టికి మార్గం వేస్తూ రోగికి కొత్త జీవితం అందిస్తుంది.
శరీరంలోని ప్రతి రక్త కణం బోన్ మ్యారో (ఎముక మజ్జ)లో తయారవుతుంది. మజ్జలోని ‘హిమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్’ (HSCs) ఎర్ర రక్త కణాలు, తెల్లరక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌గా మారతాయి. వీటిల్లో ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి)ని కలిగి ఉంటాయి. ప్లేట్ లెట్స్ గాయాల నుంచి రక్త స్రావాన్ని నిరోధించడంలో (రక్తం గడ్డకట్టడంలో) ఉపయోగపడతాయి. ఒక్కోసారి జన్యు మార్పుల వల్ల రక్తంలో కణాల పెరుగుదల అసాధారణంగా ఉంటుంది. అందువల్ల లుకేమియా, ఎప్లాస్టిక్ అనీమియా (బోన్ మ్యారో పూర్తిగా పనిచేయకపోవడం వల్ల), తలసేమియా (జన్యుపరమైన రక్త హీనత), అసాధారణ ఎర్ర రక్త కణాలు ఏర్పడినప్పుడు సికిల్ సెల్ అనీమియా వ్యాధులు వస్తాయి. వాటి నివారణకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స అవసరమవుతుంది.
బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లిష్టమైన చికిత్స. ఈ చికిత్సను ఆటోలాగస్ ట్రాన్స్‌ప్లాంట్, అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతుల్లో చేస్తారు.
ఆటోలాగస్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను న్యూరో బ్లాస్టోమా, మాడ్యులో బ్లాస్టోమా, హై రిస్క్ లింఫోమా చికిత్సలో భాగంగా చేస్తారు. ఈ విధానంలో రోగి నుంచి సేకరించిన మూల కణాలను తిరిగి అదే రోగికి ఎక్కిస్తారు. అంటే ఈ చికిత్సా విధానంలో డోనర్ అవసరం లేదు.
చికిత్సా విధానం
రోగి నుంచి ముందుగా మూల కణాలు సేకరిస్తారు. తర్వాత రోగికి హై డోస్ కీమో లేదా రేడియేషన్ థెరపీ చేస్తారు. ఆ తర్వాత రోగికి అతడి నుంచి సేకరించిన మూల కణాలనే తిరిగి ఎక్కిస్తారు.
రిలాప్స్ ఆర్ రిప్రాక్టరీ లుకేమియా అనే క్యాన్సర్, తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, ఎప్లాస్టిక్ అనీమియా, ప్రైమరీ ఇమ్యూన్ డెఫీషియన్సీ డిజార్డర్, ఇన్‌బార్న్ ఎర్రర్ ఆఫ్ మెటబాలిజం వంటి నాన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేస్తారు. ఈ విధానంలో మూల కణాలను డోనర్ నుంచి సేకరిస్తారు.
ఈ పద్థతిలో రోగి రక్త సంబంధీకులకు హెచ్ఎల్ఏ (హ్యుమన్ ల్యుకోసైడ్ ఆంటిజన్) పరీక్ష చేసి, డోనర్‌ను ఎంపిక చేస్తారు. రోగిలోని హెచ్ఎల్ఏతో డోనర్ హెచ్ఎల్ఏ పూర్తిగా మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ కాకపోతే అంటే రక్త సంబంధం లేని వారి నుంచి డోనర్‌ను ఎంపిక చేస్తారు. దీనినే మడ్ డోనర్ విధానం అంటారు. ఇలా డోనర్ నుంచి సేకరించిన మూల కణాలను రోగికి మార్పిడి చేస్తారు. మడ్ డోనర్ కూడా అందుబాటులో లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో హాఫ్ మ్యాచ్డ్ ఫ్యామిలీ డోనర్‌ను ఎంపిక చేస్తారు. అంటే రోగి కుటుంబ సభ్యుల్లోనే హెచ్ఎల్ఏ సగం మ్యాచ్ అయిన డోనర్‌ను ఎంపిక చేస్తారు. ఆ డోనర్ నుంచి మూల కణాలు సేకరిస్తారు. ఈ చికిత్సా విధానంలో ముందుగా రోగికి కీమో థెరపీ లేదా రేడియో థెరపీ చేస్తారు. ఆ తర్వాత సేకరించిన మూల కణాలను ఎక్కిస్తారు.

చాలాకాలం నుంచి స్టెమ్ సెల్ థెరపీ (మూలకణ చికిత్స) కోసం స్టెమ్ సెల్స్‌ను బోన్ మ్యారో(ఎముక మజ్జ) నుంచి మాత్రమే సేకరిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో డోనర్‌కు అనస్తీషియా ఇచ్చి, స్టెమ్ సెల్స్ సేకరించేవారు. ఇది శస్త్ర చికిత్స లాంటి ప్రక్రియ. అందువల్ల డోనర్‌కి నొప్పి అధికంగా ఉండేది. ఇప్పుడు రక్తం నుంచే మూల కణాలను సేకరించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. దీనిని పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్స్ (పీబీఎస్సీ) అంటారు. ఈ పద్ధతిలో డోనర్‌కి నొప్పి, ఆరోగ్య సమస్య రాదు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కోసం రోగి నాలుగు వారాల పాటు దవాఖానలోనే ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరు నెలల నుంచి సంవత్సర కాలం వైద్యుల పర్యవేక్షణ అవసరం.

పిల్లల్లో క్యాన్సర్స్, బ్లడ్ డిజార్డర్స్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. తలసేమియా, సికిల్‌సెల్ వంటి బ్లడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడే అవకాశం ఉంది. దీని కోసం దంపతులు ‘హెచ్‌బీ ఎలక్ట్రో సోరెసిస్’ అనే వైద్యపరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఇద్దరికీ తలసేమియా ట్రీట్ అంటే హెచ్‌బీ ఎలక్ట్రో ఫోరెసిస్ పాజిటివ్ ఉంటే వారికి పుట్టబోయే బిడ్డకు తలసేమియా వచ్చే ప్రమాదం 25 శాతం వరకు ఉంటుంది. ఇద్దరిలో ఒకరికే తలసేమియా ట్రీట్ ఉంటే వారికి పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేనట్లే. ఇద్దరిలో తలసేమియా ట్రీట్ ఉంటే గర్భందాల్చితే… పిండానికి సీవీఎస్ లేదా అమ్నియో సెంటసిస్ పరీక్ష చేయాలి. ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ వస్తే బిడ్డ భవిష్యత్ దృష్ట్యా చట్ట ప్రకారం ఆ పిండాన్ని తొలగించుకునే హక్కు దంపతులకు ఉంటుంది.
తలసేమియా, ఎప్లాస్టిక్ అనీమియాకు చికిత్స పొందుతున్న రోగులను ఆదుకునేందుకు కేంద్ర ఆరోగ్య పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది బాధితులకు ఈ విషయం తెలియక చికిత్స కోసం అప్పులపాలవుతుంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘తలసేమియా బాల్ సేవా యోజన్’ అనే ఆరోగ్య పథకం ద్వారా కోల్ ఇండియా ఆర్థిక సహాయం చేస్తోంది.
– మహేశ్వర్‌రావు బండారి
– డా. నల్ల అనురాగ్ రెడ్డి ఎండీ, ఎఫ్ఐఏ (పీహెచ్ఓ), ఫెలో ఇన్ పిడియాట్రిక్ బ్లడ్ & మ్యారో ట్రాన్స్‌ప్లాంట్,
కన్సల్టెంట్ పిడియాట్రిక్ హెమటాలజిస్ట్ & బీఎంటీ ఫిజీషియన్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్