Tamarind Seeds | చింతపండును మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని పప్పు లేదా చారు, రసం వంటి వాటిల్లో, పులుసు కూరల్లోనూ వేస్తుంటారు. చింత చచ్చినా పులుపు చావదు అనే సామెతను కూడా మీరు వినే ఉంటారు. చింతపండు ఇచ్చే పులుపు రుచి కూరలకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది లేకుండా అసలు కూరలను చేయరు. అయితే చింతపండే కాదు, చింత గింజల్లోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం చింత గింజలు మనకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు చింత గింజలు ఎంతో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో చింత గింజలను చాలా మంది ఇళ్లలో నిల్వ చేసి పలు అవసరాలకు ఉపయోగిస్తుంటారు. ఏయే వ్యాధులను తగ్గించుకోవాలంటే ఈ గింజలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత గింజల్లో ఉండే ఒక రకమైన ప్రోటీన్ కారణంగా ఈ గింజలు యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయని ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ వివరాలను వైరాలజీ జర్నల్‌లోనూ ప్రచురించారు. చింత గింజలను ఉపయోగించి తయారు చేసే ఔషధాలు చికున్ గున్యాను తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చింత గింజల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు జ్వరాన్ని తగ్గిస్తాయని వారు తెలియజేస్తున్నారు. చింత గింజలను పెనంపై కాస్త వేయించి వాటి ఎండబెట్టి పొట్టు తీయాలి. అనంతరం ఆ గింజల్లో ఉండే పప్పును సేకరించి దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిలో కాస్త నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను తోముకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే దంతాలపై ఉండే పాచి, గార పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
చింత గింజల పొడిని పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి రాత్రి నిద్రకు ముందు సేవించాలి. ఇలా చేస్తుంటే అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చింత గింజల పొడిని నీటిలో కలిపి రోజూ తాగుతుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
చింత గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చర్మ సమస్యలు ఉన్నవారు కాస్త చింత గింజల పొడిలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని రాస్తుండాలి. దీంతో దురదలు, గజ్జి, తామర నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గాయాలు, పుండ్లు మానుతాయి. చింత గింజల పొడిని మీరు తినే ఆహారాలపై కాస్త చల్లి తింటుండాలి. దీంతో డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా చింత గింజలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరికి ఈ గింజలు అలర్జీలను కలిగించవచ్చు. అలాగే కొందరు ఈ గింజల పొడిని వాడితే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వైద్యుల సలహా మేరకు ఈ గింజల పొడిని వాడుకోవడం మంచిది.