Fiber Foods | వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా సలాడ్లు తినాలని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గడం, శరీరానికి ఫైబర్ అందించడం కోసం ముడి కూరగాయలతో చేసిన సలాడ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే తీవ్ర ఎండల్లో అధికంగా ముడి సలాడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరం వేడికి గురయ్యే వేసవి కాలంలో జీర్ణక్రియ సున్నితంగా మారుతుందని చెబుతున్నారు. ఫైబర్ శరీరానికి అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ అధికంగా తీసుకుంటే అదే ఫైబర్ కడుపులో ఇబ్బందులకు కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో ముడి సలాడ్లను తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు మంట, క్రాంప్స్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాంటి సమయంలో ముడి కూరగాయల్లో ఉండే అధిక ఫైబర్‌ను జీర్ణం చేయడం పొట్టకు కష్టమవుతుంది. దీంతో ఆ ఫైబర్ జీర్ణాశయం (గట్)లో ఫర్మెంటేషన్‌కు గురై గ్యాస్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ఫలితంగా కడుపు బిగుసుకుపోయినట్టు అనిపించడం, ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. నిపుణుల ప్రకారం ముడి సలాడ్లు అధికంగా తినడం వల్ల కడుపులో ఫైబర్ పరిమాణం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో గ్యాస్ ఫార్మేషన్, అబ్డోమినల్ బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్నవారిలో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో ఫైబర్ అధికమైందని సూచించే కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. తరచూ కడుపు ఉబ్బరంగా ఉండటం, ఎక్కువ గ్యాస్ సమస్య, కడుపు నొప్పి లేదా క్రాంప్స్, ఎప్పుడూ కడుపు నిండిన భావన ఉండటం వంటి సంకేతాలు కనిపిస్తే ఫైబర్ మోతాదును పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వేసవిలో కొంతమంది ఆహారం తీసుకునే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఐబీఎస్, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు, అలాగే ఒక్కసారిగా హై-ఫైబర్ డైట్ ప్రారంభించినవారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో శరీరం ఫైబర్‌ను సరిగ్గా జీర్ణం చేయలేక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో ఫైబర్‌ను సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ముడి కూరగాయలకంటే స్వల్పంగా ఉడికించిన కూరగాయలను తినడం జీర్ణక్రియకు సులభంగా ఉంటుంది. ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెంచడం మంచిది. తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. ఎందుకంటే నీరు లేకపోతే ఫైబర్ కడుపులో మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారంతో ఫైబర్‌ను సమతుల్యం చేస్తే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. సలాడ్లు తిన్న తర్వాత తీవ్రమైన ఉబ్బరం, భోజనం తర్వాత నొప్పి, రోజంతా కొనసాగే జీర్ణ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మందులు వేసుకున్నా సమస్య తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం అయినప్పటికీ, మోతాదు, తీసుకునే విధానం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో శరీర పరిస్థితిని బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అవసరం. పొట్ట ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, తగిన మోతాదులో ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.