Healthy Protein Rich Snacks | ప్రతి రోజూ సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని వెదుకుతుంటారు. ఇంట్లో ఏమీ స్నాక్స్ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లి మరీ ఏదో ఒకటి తింటుంటారు. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ రోజూ స్నాక్స్ తింటే మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోగాలకు స్వాగతం పలికినట్లు అవుతుంది. కనుక జంక్ ఫుడ్‌ను, బేకరీ పదార్థాలను, నూనె పదార్థాలను, స్వీట్లను ఎక్కువగా తినకూడదు. అయితే సాయంత్రం సమయంలో మరి ఆకలవుతుంది కదా.. అలాంటప్పుడు ఏ ఆహారాలను తినాలి.. అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ ఆకలి అయితే చిరుతిళ్లను తినాల్సిన పనిలేదు. పలు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా తినవచ్చు. వీటితో మనకు రుచి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి.
నల్ల శనగలను లేదా కాబూలీ శనగలను రోస్ట్ చేసి లేదా ఉడకబెట్టి పోపు వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు, మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలను అందిస్తాయి. శనగల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. ఉత్తేజంగా ఉంచుతాయి. అలాగే వీటి ద్వారా లభించే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక సాయంత్రం సమయంలో ఫూల్ మఖనాలను కూడా తినవచ్చు. వీటినే ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. తెలుగులో తామర విత్తనాలుగా పిలుస్తారు. వీటిని కూడా శనగల మాదిరిగానే ఉడకబెట్టి లేదా పెనంపై కాస్త వేయించి తినవచ్చు. అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అదిక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ స్నాక్స్ అని చెప్పవచ్చు. అలాగే ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
పూర్వకాలంలో మన పెద్దలు సత్తు పిండితో జావ తయారు చేసి తాగేవారు. సాయంత్రం అనారోగ్యకరమైన చిరుతిండి తినేందుకు బదులుగా ఈ సత్తు పిండితో తయారు చేసిన జావను తాగవచ్చు. ఇది వెజిటేరియన్లకు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. ఇది కండరాలను బలంగా మార్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది. దీంతో కండరాలకు మరమ్మత్తు కూడా జరుగుతుంది. దీని వల్ల శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. సాయంత్రం సమయంలో పెసలను ఉడకబెట్టి కూడా తినవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. పెసలను ఇలా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. గర్భిణీలకు పెసలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి రుచిగా ఉండడమే కాదు, పోషకాలను, శక్తిని కూడా అందిస్తాయి.
సాయంత్రం సమయంలో పనీర్, పండ్ల ముక్కలను కలిపి ఫ్రూట్ సలాడ్ చేసి కూడా తినవచ్చు. పనీర్ శరీరానికి కావల్సిన ప్రోటీన్లను అందిస్తుంది. పండ్లు మనకు కావల్సిన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. దీంతో సాయంత్రం సమయంలో వీటిని తింటే పెద్దగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాయంత్రం సమయంలో సోయాబీన్ విత్తనాలను కూడా ఉడకబెట్టి తినవచ్చు. ఇవి బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. శరీరానికి శక్తి అందుతుంది. ఉత్సాహంగా ఉంటారు. చాలా సేపు ఉన్నా కూడా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే అనేక లాభాలను పొందవచ్చు.