Natural Pain Killers | ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి మెడిసిన్‌ను కొనుగోలు చేసి డాక్టర్ సహాయం లేకుండానే మందులను వాడుతారు. అయితే ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు ప్రయోజనం కలిగినా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలా స్వయంగా మందులను వాడడం అసలు మంచిది కాదు. దీర్ఘకాలంలో ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. అయితే చాలా మందికి వచ్చే నొప్పులకు గాను పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వాడుతుంటారు. ఇవి దీర్ఘకాలంలో కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కిడ్నీలు డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. కనుక పెయిన్ కిల్లర్లను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. అయితే మనకు మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్లుగా పనిచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగులో లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా. మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి ఉన్నవారు పెరుగును తింటే ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలో వృద్ధి చెందుతుంది. దీంతో కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నా కూడా పెరుగును తింటే విముక్తి లభిస్తుంది. పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇది నాచురల్ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఏదైనా హెర్బల్ టీని సేవిస్తున్నా కూడా నాచురల్ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. గ్రీన్ టీ ఇదే జాబితాకు చెందుతుంది.
గ్రీన్ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నొప్పులు తగ్గేలా చేస్తాయి. కాబట్టి మీకు ఏదైనా నొప్పి ఉంటే గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోండి. అలాగే చెర్రీ పండ్లు కూడా నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు చెర్రీ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. రాత్రి పూట చెర్రీ పండ్లను తింటే చక్కగా నిద్ర పట్టడమే కాదు, నొప్పులు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా రోజూ మనం వంటల్లో వాడే పసుపు కూడా నొప్పులను తగ్గిస్తుంది. దీంట్లోనూ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగుతుంటే ఎలాంటి నొప్పి నుంచి అయినా సరే రిలీఫ్ లభిస్తుంది. పసుపు సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది.
కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు అల్లం రసం సేవిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసం తాగుతుండాలి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అల్లం రసం తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. అలాగే చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. దీంతో మెడ, వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటే భిన్న రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు. దీంతో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వాడాల్సిన అవసరం ఉండదు.