Bitter Foods | ప్రస్తుత తరుణంలో చాలా మంది కేవలం తీపి రుచికే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. తీపి పదార్థాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకనే ఇతర రుచులు ఉండే ఆహారాలను తక్కువ తింటుంటారు. అయితే వాస్తవానికి తీపి పదార్థాలను అతిగా తినడం మంచిది కాదు. ఆయుర్వేదం కూడా రోజూ మనం అన్ని రకాల రుచులు కలిగిన ఆహారాలను తినాలని చెబుతుంటుంది. కనుక అన్ని రుచులను మనం ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు చేదు రుచిని పక్కన పెడుతుంటారు. చేదుగా ఉండే ఆహారాలను కనీసం ముట్టుకోరు. కానీ వీటిని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. చేదుగా ఉండే ఆహారాలను కూడా తరచూ తినాల్సి ఉంటుంది. ఈ పదార్థాలు మనకు కలిగే పలు వ్యాధులను నయం చేస్తాయి.
ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టమే. చాలా మంది నేరుగా వీటిని తింటుంటారు. కొందరు వీటితో పులిహోర, పచ్చడి, పప్పు వంటివి చేస్తుంటారు. అయితే ఉసిరికాయల్లో సహజంగానే పులుపు అధికంగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఇవి కాస్త చేదు రుచిని కూడా కలిగి ఉంటాయి. కనుక ఉసిరికాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని జ్యూస్‌ను కూడా తాగవచ్చు. ఉసిరికాయల్లో విటమిన్ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఉసిరికాయలు యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. కలబంద రసం కూడా కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది. కనుక దీన్ని కూడా ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.
కలబందలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కలబంద రసాన్ని తాగుతుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక పసుపును మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. ఇది కూడా చేదు రుచినే కలిగి ఉంటుంది. పసుపుతో టీ తయారు చేసి తాగవచ్చు. లేదా పాలలో పసుపు కలిపి తాగవచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. పసుపులో ఉండే కర్ క్యుమిన్ అనే సమ్మేళనం రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
వేపాకులు చేదుగా ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ వీటిని కూడా తరచూ తినాలి. ముఖ్యంగా రోజూ ఉదయాన్నే పరగడుపునే వేపాకులను తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. కాకరకాయ కూడా చేదుగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీన్ని తీసుకుంటున్నా కూడా షుగర్, కొలెస్ట్రాల్, అధిక బరువును తగ్గించుకోవచ్చు. దీంతో బీపీ కూడా అదుపులోకి వస్తుంది. ఇక చేదుగా ఉండే మరొక పదార్థం మెంతులు. వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. అనేక రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా పలు రకాల చేదు ఆహారాలను తరచూ తింటుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటారు.