Taro Root | మనకు అన్ని కాలాల్లోనూ దుంపలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొందరు ఉడికించి తింటే కొందరు కూరగా చేసి తింటారు. ఎలా తిన్నా సరే పలు రకాల దుంపలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. దుంపల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోదగినవి చామ దుంపలు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో చాలా మంది పులుసు చేస్తుంటారు. టమాటాలు వేసి వండినా కూడా ఇవి రుచిగానే ఉంటాయి. చామ దుంపలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. చామ దుంపలు జిగురుగా ఉంటాయని కొందరు వీటిని తినరు. కానీ వీటిని తినకపోతే అనేక ప్రయోజనాలను కోల్పోతారు. చామ దుంపలను 100 గ్రాములు తింటే120 క్యాలరీల శక్తి లభిస్తుంది.
కానీ ఈ దుంపల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక అన్ని క్యాలరీలు లభించినప్పటికీ వెంటనే అవి మనకు అందవు. ఆలస్యంగా రక్తంలో కలుస్తాయి. కనుక షుగర్ ఉన్నవారు కూడా ఈ నిర్భయంగా ఈ దుంపలను తినవచ్చు. పైగా ఈ దుంపలను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చామ దుంపల్లో అధికంగా ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తినరు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. చామ దుంపలను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ దుంపలను తినడం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి చామ దుంపలు ఎంతో మేలు చేస్తాయి.
ఇతర దుంపల మాదిరిగానే చామ దుంపల్లోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినలేని వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఈ దుంపలను తింటే ప్రోటీన్లు లభించి శరీరానికి శక్తి అందుతుంది. కండరాలు నిర్మాణం అవుతాయి. చామ దుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. చామ దుంపలను తింటే రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. చామ దుంపల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చామ దుంపలను తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీంతో శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. ఈ దుంపలు నపుంసకత్వాన్ని పోగొడతాయి.
చామ దుంపల్లో ఉండే సమ్మేళనాలు స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. రుతుక్రమం సరిగ్గా వచ్చేలా చేస్తాయి. దీంతో స్త్రీలలో రుతు సమస్యలు ఉండవు. చామ దుంపలను ఆహారంలో భాగం చేసుకుంటే ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. ఇలా చామ దుంపలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే అలర్జీలు ఉన్నవారు చామ దుంపలకు దూరంగా ఉండాలి. వీటిని తింటే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వీటికి దూరంగా ఉంటే మంచిది.