Sprouted Garlic | వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిని చాలా మంది నేరుగా కూడా తింటుంటారు. వెల్లుల్లిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వెల్లుల్లిని నేరుగా అలాగే కాకుండా మొలకెత్తించి కూడా తినవచ్చు. దీని వల్ల మనకు రెట్టింపు మొత్తంలో పోషకాలు లభిస్తాయి. చాలా మంది నిల్వ ఉంచిన వెల్లుల్లి రెబ్బలకు మొలకలు వస్తే పడేస్తుంటారు. అలాంటి వెల్లుల్లిని తినకూడదని అనుకుంటారు. కానీ ఇది ఇతర కూరగాయల్లా కాదు. మొలకెత్తిన వెల్లుల్లిని తింటేనే ఇంకా మనకు ఎక్కువ లాభం కలుగుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. వెల్లుల్లిని మొలకెత్తించి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన వెల్లుల్లిలో సాధారణ వెల్లుల్లి కన్నా కాస్త ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో మెటాబొలెట్స్ అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడ పీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయి. అయితే మెటాబొలెట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. రక్త నాళాలు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
మొలకెత్తిన వెల్లుల్లిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లిని తింటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా ఈ వెల్లుల్లిని తింటే చర్మ కణాలకు ఎంతో మేలు జరుగుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లిని తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. బుద్ధి పెరుగుతుంది. నాడులన్నీ ఉత్తేజం అవుతాయి. వారు చదువుల్లో రాణిస్తారు. అలాగే పెద్దలకు మతిమరుపు తగ్గుతుంది.
అయితే వెల్లుల్లిని ఎలా మొలకెత్తించాలి..? అని చాలా మందికి సందేహం వస్తుంది. ఇందుకు గాను చిన్న పద్ధతిని అనుసరిస్తే చాలు, వెల్లుల్లి రెబ్బలను చాలా సులభంగా మొలకెత్తించవచ్చు. అందుకు ఏం చేయాలంటే వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా కలిసి ఉండే భాగాన్ని తీసుకుని వాటిని ఒక పాత్రలోని నీటిలో కేవలం వేర్లు మాత్రమే మునిగేలా పెట్టాలి. ఇలా వెల్లుల్లి ఉంచిన పాత్రను కిటికీ వద్ద లేదా కాస్త సూర్య రశ్మి తగిలేలా ఉంచాలి. దీంతో ఆ వెల్లుల్లి రెబ్బలకు మొలకలు వస్తాయి. తరువాత వాటిని తీసి ఉపయోగించవచ్చు. ఇలా వెల్లుల్లి రెబ్బలను మొలకెత్తించి తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.