Cashews | జీడిపప్పు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. జీడిపప్పును చాలా మంది నేరుగా అలాగే తింటుంటారు. మసాలా వంటకాల్లోనూ, బిర్యానీ వంటల్లోనూ జీడిపప్పును ఎక్కువగా వేస్తుంటారు. అయితే జీడిపప్పు ఖరీదు ఎక్కువగా ఉంటుంది కనుక దీన్ని అందరూ తినలేరు. కానీ జీడిపప్పును తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీడిపప్పును గుప్పెడు మోతాదులో రోజూ నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పును నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. జీడిపప్పును రోజూ నానబెట్టి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి ఎల్డీఎల్. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇంకొకటి హెచ్‌డీఎల్. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మనం మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అయితే జీడిపప్పును రోజూ నానబెట్టి తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది.
జింక్, ఐరన్, మెగ్నిషియం వంటి పోషకాలు జీడిపప్పులో అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడు కణాలను నిర్మిస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కనుక చిన్నారులు చదువుల్లో రాణించాలంటే వారికి రోజూ జీడిపప్పును పెట్టాలి. ఇక పెద్దలు దీన్ని రోజూ తింటే మతిమరుపు సమస్య తగ్గుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్ప్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీడిపప్పులో ఫైటిక్ యాసిడ్‌తోపాటు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కనుక ఈ పప్పును రోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా శరీరం సరిగ్గా శోషించుకునేందుకు జీడిపప్పు ఎంతగానో దోహదపడుతుంది. జీడిపప్పులో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు విరిగే చాన్స్ తక్కువగా ఉంటుంది.
జీడిపప్పులో కాపర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పప్పును రోజూ తింటే యంగ్ గా కనిపిస్తారు. ముఖంపై ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు. ఇలా జీడిపప్పును రోజూ నానబెట్టి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.