Sesame Jaggery Laddu | సాయంత్రం అయిందంటే చాలా మంది ఏం చిరు తిండి తిందామా.. అని ఆలోచిస్తుంటారు. బయట రహదారుల పక్కన బండ్లపై లభించే బజ్జీలు, బొండాలు, మిర్చి, పునుగులతోపాటు సమోసా, బేకరీలలో లభించే వివిధ రకాల పఫ్స్, చిప్స్ వంటి ఫుడ్స్‌ను సాయంత్రం తింటారు. అయితే ఇవన్నీ అనారోగ్యకరమైన ఆహారాలు. వీటిని తింటే మన శరీరానికి ఎలాంటి లాభం కలగకపోగా నష్టాలే కలుగుతాయి. ఎప్పుడో ఒకసారి అయితే జిహ్వా చాపల్యం కొద్దీ ఈ ఆహారాలను తినవచ్చు. కానీ తరచూ తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే తద్వారా స్నాక్స్ తిన్న అనుభూతి కలుగుతుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి ఎలాంటి హాని కలగదు. ఇక ఆరోగ్యకరమైన స్నాక్స్ విషయానికి వస్తే వాటిల్లో నువ్వుల లడ్డూలు ఒకటని చెప్పవచ్చు.
నువ్వుల లడ్డూలను బెల్లంతో కలిపి తయారు చేసుకుని రోజూ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో ఒకటి లేదా రెండు లడ్డూలను తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నువ్వుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కనుక ఈ లడ్డూలను తింటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వుల్లో ఉండే మెగ్నిషియం, ఫాస్ఫరస్ కూడా ఎముకలను బలంగా ఉంచుతాయి. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. ఈ లడ్డూలను తింటే ఆయా పోషకాలు సమృద్ధిగా లభించి వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. నువ్వుల లడ్డూల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ లడ్డూలను తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
నువ్వుల లడ్డూలను తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. సాయంత్రానికి నీరసం అలసట ఉంటాయి కనుక ఆ సమయంలో ఈ లడ్డూలను తింటే మళ్లీ ఉత్సాహంగా మారుతారు. శక్తి వచ్చి మళ్లీ యాక్టివ్‌గా పనిచేస్తారు. ఈ లడ్డూల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కనుక అలసట, నీరసం ఉన్నవారు ఈ లడ్డూలను తింటుంటే మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం రాకుండా చూస్తుంది. బెల్లం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. కనుక నువ్వుల లడ్డూలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే లిగ్నన్స్, ఫైటోస్టెరాల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. నువ్వుల లడ్డూలను తింటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చల్లని వాతావరణంలో శరీరం వేడిగా ఉంటుంది. చలి నుంచి తట్టుకోవచ్చు. అలాగే ఈ లడ్డూల్లో ఉండే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇలా ఈ లడ్డూలను రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.