Red Color Foods For Heart Health | మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి. గుండె నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయాలి. వేళకు నిద్రించాలి. తగినన్ని నీళ్లను తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం వల్లనే చాలా వరకు గుండె సమస్యలు వస్తున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన పోషకాలు లేని లేదా జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం వల్ల గుండెకు నష్టం జరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఇక కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఎరుపు రంగులో ఉండే ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రంగులో ఉండే ఆహారాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ పండ్లను, టమాటాలు, ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం వంటి వాటిని తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం ఎక్కువగా తయారవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది.
నిపుణులు చెబుతున్న ప్రకారం ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్లు ఎ, సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త సరఫరాను పెంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వాపులను లేకుండా చేస్తుంది. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. దానిమ్మ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ప్డ్లలో ప్యూనికాలాగిన్స్, పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
స్ట్రాబెర్రీలలో యాంథో సయనిన్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడాలంటే చెర్రీ పండ్లను కూడా తినాల్సి ఉంటుంది. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. అందువల్ల వీటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ పండ్లను తింటే వాపులు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
మనకు అధికంగా అందుబాటులో ఉండే కూరగాయల్లో బీట్రూట్ కూడా ఒకటి. ఇవి మనకు ఏ సీజన్ లో అయినా సరే అందుబాటులో ఉంటాయి. అయితే రోజూ బీట్రూట్ను తిన్నా లేదా జ్యూస్ తాగినా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బీట్రూట్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎరుపు రంగులో ఉండే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.