Mustard | ఆవాల గురించి అందరికీ తెలిసిందే. వీటిని మనం ఎంతో కాలం నుంచే వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నాం. ఆవ పిండిని ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఆవాలను కేవలం వంటల్లో ఇలా ఉపయోగిస్తారు కానీ అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. ఆవాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఆవాల్లో మెగ్నిషియం, క్యాల్సియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఆవాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆరోగ్య పరంగా ఆవాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఆవాలలో ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఆవాల్లో సుమారుగా 9.82 మిల్లీ గ్రాముల టోకోఫినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది విటమిన్ ఇ లా పనిచేస్తుంది.
ఆవాలలో ఉండే టోకోఫినాల్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుకనే ఆవనూనెను వంటల్లో ఉపయోగించాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు, ఇది గుండెకు సంరక్షణను అందిస్తుంది. గుండె పోటు రాకుండా చూస్తుంది. ఆవాల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపు దినుసులుగా ఆవాలను ఉపయోగిస్తే అవి ఆకలిని పెంచుతాయి. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేట్లు చేస్తాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవాల పొడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఆవాల్లో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి.
ఆవాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవాలను దంచి వాపు ఉన్న ప్రదేశంలో వేసి కట్టులా కడుతుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా గౌట్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అర బకెట్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఆవాల పొడి వేసి కాళ్లను కొద్ది సేపు అందులో ఉంచాలి. దీంతో పాదాల నొప్పులు తగ్గుతాయి. తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి బాగా పట్టించి మర్దనా చేయాలి. కాసేపు అయ్యాక స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం మంచి రంగును పొందుతుంది. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది.
కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుండాలి. దీంతో అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు చిట్లడం తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. 100 గ్రాముల ఆవాలలో తేమ 6.5 గ్రాములు, పొటాషియం 20.3 మిల్లీగ్రాములు, కొవ్వులు 39.7 గ్రాములు, ఫైబర్ 4.8 గ్రాములు. పిండి పదార్థాలు 23.8 గ్రాములు, క్యాల్షియ 490 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 700 మిల్లీగ్రాములు, ఐరన్ 7.9 మిల్లీగ్రాములు, టోకోఫినాల్ 9.82 మిల్లీగ్రాములు ఉంటుంది. 100 గ్రాముల ఆవాలతో మనకు సుమారుగా 540 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఆవాల ద్వారా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వేడి శరీరం ఉన్నవారు వీటిని తీసుకోరాదు. ఆవాలను చాలా తక్కువ మోతాదులో వాడుకుంటే ఎక్కువ ఫలితం పొందవచ్చు.