Kasuri Methi | మెంతులనే కాదు, మెంతి ఆకులను కూడా మనం ఆహారంలో భాగంగా వాడుతుంటాం. మెంతి ఆకులతో కూర, పప్పు, చారు వంటివి చేస్తుంటారు. ఇతర కూరల్లోనూ మెంతి ఆకులను వేస్తుంటారు. ఈ ఆకు చేదుగా ఉంటుందని చాలా మంది వాడరు. కానీ మెంతి ఆకుల్లో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఇక మెంతి ఆకులను ఎండబెట్టి కసూరి మేథీ తయారు చేస్తారు. ఎండిన మెంతి ఆకులనే కసూరి మేథీ అంటారు. కసూరి మేథీని ఉత్తర భారతానికి చెందిన వారు ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. కసూరి మేథీతోనూ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పలు వ్యాధులను తగ్గించడంలో కసూరి మేథీ అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
కసూరి మేథీలో క్యాల్షియం, ఇతర ముఖ్యమైన మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కసూరి మేథీలో ఉండే మెగ్నిషియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. మనం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు మెగ్నిషియం అవసరం అవుతుంది. కసూరి మేథీలో ఉండే మెగ్నిషియం మన శరీరంలో క్యాల్షియం శోషణకు పనిచేస్తుంది. దీంతో ఎముకలకు క్యాల్షియం లభించి ఆరోగ్యంగా ఉంటాయి. కసూరి మేథీకి శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. కనుక చలి ప్రాంతాల్లో ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటారు. కసూరి మేథీ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చలిగా ఉన్న వాతావరణంలో దీన్ని తింటే ఎంతో మేలు చేస్తుంది.
కసూరి మేథీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు కసూరి మేథీని తింటుంటే ప్రయోజనం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కసూరి మేథీలో ఉండే పలు సమ్మేళనాలు మన శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కసూరి మేథీలో రుచిగా చేదుగా ఉంటుంది. కనుక ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ కసూరి మేథీని తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఇది శరీరం ఇన్సులిన్ ను గ్రహించేలా చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
అధిక బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా కసూరి మేథీని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. కసూరి మేథీలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. చర్మ సంరక్షణకు కూడా కసూరి మేథీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షిస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా తేమగా, తాజాగా, మృదువుగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఇలా కసూరి మేథీతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.