Jowar | ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు జొన్నలనే ఆహారంగా తినేవారు. జొన్నలతో గటక లేదా జావ తయారు చేసి తాగేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. జొన్నలను పేదవాడి ఆహారంగా పిలుస్తారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు తింటుంటారు. అనేక వ్యాధులను తగ్గించడంలో జొన్నలు అద్భుతంగా పనిచేస్తాయి. జొన్నలతో అన్నం తయారు చేసి కూడా తినవచ్చు. 30 దేశాల్లో సుమారుగా 500 మిలియన్ల మంది ప్రజలు జొన్నలను తమ ప్రధాన ఆహార ధాన్యంగా తింటున్నారు. జొన్నల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక ప్రోటీన్లు ఉంటాయి. అనేక కార్బొహైడ్రేట్లతోపాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో సమృద్ధిగా ఉంటాయి. జొన్నలు మనకు శక్తిని అందిస్తాయి.
అధికంగా బరువు ఉన్నవారు రోజువారి ఆహారంలో జొన్నలను చేర్చుకుంటే దీంతో బరువు తగ్గుతారు. జొన్నలను తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు రోజూ జొన్న లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జొన్నల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. వీటిల్లో క్యాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే అనేక రకాల బి విటమిన్లు కూడా జొన్నల్లో ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శరీరానికి శక్తిని అందజేస్తాయి.
జొన్నలతో చేసిన రొట్టెలు ఎంతో రుచిగా ఉంటాయి. జొన్న పేలాలతో లడ్డూలు, అప్పడాలు, అంబలి తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నల్లో అధికంగా ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. పురుషులు జొన్నలను తింటే శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. గోధుమల్లో అయితే గ్లూటెన్ ఉంటుంది. కానీ జొన్నల్లో ఇది ఉండదు. అందువల్ల గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు జొన్నలను నిర్భయంగా తినవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా జొన్నలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో చాలా మంది జొన్నలను పండిస్తున్నారు. చిరు ధాన్యాలపై ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. కనుక ఇవి మనకు ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటున్నాయి.
జొన్నలను 100 గ్రాముల మేర తింటే 72 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. 11 గ్రాముల ప్రోటీన్లను పొందవచ్చు. 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఐరన్ 4 మిల్లీగ్రాములు, క్యాల్షియం 25 మిల్లీగ్రాములు, ఫోలిక్ యాసిడ్ 20 మిల్లీగ్రాములు లభిస్తాయి. కాబట్టి జొన్నలను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. జొన్నలను తింటే శక్తి, పోషకాలు రెండింటినీ పొందవచ్చు. జొన్నలు తేలిగ్గానే జీర్ణమవుతాయి. ఇవి రోగాల బారిన పడిన వారు త్వరగా కోలుకునేలా చేస్తాయి. బాలింతలకు జొన్నలు మంచి బలవర్ధకమైన ఆహారంగా పనిచేస్తాయి. జొన్నల్లో పీచు ఉంటుంది. ఇది జీర్ణసమస్యలు రాకుండా చూస్తుంది. ఇలా జొన్నలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక జొన్నలను రోజూ తినే ప్రయత్నం చేయండి.