Jaggery With Ginger | అల్లాన్ని మనం రోజూ వంటల్లో వేస్తూనే ఉంటాం. దీన్ని ఎక్కువగా మసాలా వంటకాల్లో వేస్తుంటారు. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అలాగే బెల్లాన్ని కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని ఎక్కువగా తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లం, బెల్లం మిశ్రమం మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. రోజూ చిన్న అల్లం ముక్కను కాస్త బెల్లంతో కలిపి తింటుండడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మిశ్రమం పలు వ్యాధులను నయం చేస్తుంది. అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గేలా చేస్తుంది.
అల్లం, బెల్లం మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస సరిగ్గా లభిస్తుంది. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గొంతు సమస్యలు సైతం తగ్గిపోతాయి. గొంతులో నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటి మిశ్రమం శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చల్లని వాతావరణం లేదా చలి కాలంలో ఈ మిశ్రమాన్ని తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. చలి నుంచి రక్షణ లభిస్తుంది. ఈ మిశ్రమంలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. దీన్ని తింటే శరీరానికి జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీని వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
ఈ మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ మిశ్రమాన్ని తింటే ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని తింటుంటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్గా మారుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది.
స్త్రీలు నెలసరి సమయంలో ఈ మిశ్రమాన్ని తింటుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, అధిక రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుతాయి. నెలసరి సరిగ్గా వచ్చేందుకు ఈ మిశ్రమం దోహదం చేస్తుంది. హార్మోన్ల సమస్యలను తగ్గిస్తుంది. ఇలా అల్లం, బెల్లం మిశ్రమం మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. అయితే ఈ మిశ్రమం కొందరిలో అతి వేడిని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వారు ఈ మిశ్రమాన్ని తినరాదు. అలాగే అలర్జీలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. ఈ విధంగా జాగ్రత్తలను పాటిస్తూ ఈ మిశ్రమాన్ని రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.