Green Peas | పచ్చి బఠానీలను చాలా మంది పలు రకాల వంటకాల్లో వేస్తుంటారు. ఎక్కువగా మసాలా వంటకాల్లో వీటిని ఉపయోగిస్తారు. అయితే వీటిని చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ పోషకాహార నిపుణులు మాత్రం దీన్ని సూపర్ ఫుడ్ అని చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బఠానీల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి. పచ్చి బఠానీలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. వీటిల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే విటమిన్ కె ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయం చేస్తుంది. ఈ విటమిన్ పచ్చి బఠానీల ద్వారా మనకు కావల్సినంత లభిస్తుంది.
పచ్చి బఠానీల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి బఠానీల్లో అనేక రకాల బి విటమిన్లు కూడా ఉంటాయి. ప్రధానంగా థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి మన శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పచ్చి బఠానీల్లో మాంగనీస్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, పొటాషియం వంటి మినరల్స్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.
నాన్ వెజ్ తినలేని వారికి పచ్చి బఠానీలు మంచి ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శాకాహారులకు కావల్సిన ప్రోటీన్లను అందిస్తాయి. ఒక కప్పు పచ్చి బఠానీలను ఉడకబెట్టి తింటే సుమారుగా 9 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఇది చికెన్, మటన్ ద్వారా లభించే ప్రోటీన్లకు సమానం. కనుక నాన్ వెజ్ తినని వారు పచ్చి బఠానీలను తింటే ప్రోటీన్లను పొంది తద్వారా శక్తివంతంగా మారవచ్చు. పచ్చి బఠానీల్లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీలను తింటే సుమారుగా 8 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
పచ్చి బఠానీల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా వీటిలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు పచ్చి బఠానీలను తింటే మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా సైతం మెరుగు పడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పచ్చి బఠానీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా పచ్చి బఠానీలతో మనం అనేక లాభాలను పొందవచ్చు.