Kiwi Fruit | ఈమధ్య కాలంలో చాలా మంది కివి పండ్లను కొని తింటున్నారు. గతంలో సూపర్ మార్కెట్లలోనే లభించే ఈ పండ్లను బయట వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు. డెంగీ లేదా విష జ్వరాలు వచ్చిన వారికి ఎక్కువగా కివి పండ్లను ఇస్తున్నారు. అందువల్ల ఈ పండ్లను చాలా మంది తింటున్నారు. అయితే వాస్తవానికి కివి పండ్లను కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాదు, రోజూ తినాల్సిందే. కివి పండ్లను రోజుకు ఒకటి చొప్పున తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కివి పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
కివి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి. వాటిల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కివి పండ్లు ప్రీ బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతాయి. అంటే ఈ పండ్లను తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉశపమనం అందిస్తుంది. కివి పండ్లలో యాక్టినైడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది. కనుక ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తిన్నప్పుడు ఒక కివి పండును తింటే సులభంగా ఆహారం జీర్ణమవుతుంది. మాంసాహారం తిన్నప్పుడు ఇలా చేస్తే మేలు జరుగుతుంది. దీంతో అజీర్తి రాకుండా చూసుకోవచ్చు.
కివి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి గుండెను రక్షిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. కివి పండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ ఒక కివి పండును తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కివి పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.
కివి పండ్లలో విటమిన్ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. దీంతో చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. ఫలితంగా చర్మంపై వృద్ధాప్య ఛాయలు రావు. చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. మొటిమల సమస్య ఉన్నవారు రోజుకు ఒక కివి పండును తింటుంటే ఫలితం ఉంటుంది. లేదా ఈ పండ్లను పేస్ట్‌లా చేసి దాంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు. కివి పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ పండ్లలో విటమిన్ కె కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కివి పండ్లను తినడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర లేమి నుంచి బయట పడవచ్చు. ఇలా కివి పండ్లతో అనేక లాభాలను పొందవచ్చు.