అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా తక్కువే. కనుక చాలా మంది అరటి పండ్లను తింటుంటారు. అరటి పండ్లతో కొందరు మిల్క్ షేక్ లేదా స్మూతీ, పండ్ల రసం తయారు చేసి తాగుతుంటారు. అయితే వాస్తవానికి అరటి పండ్లను రోజులో ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కలిపి తినాలి. ఇలా అరటి పండును కనీసం రోజుకు ఒకటి అయినా సరే ఉదయం తినాల్సి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అరటి పండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఎంతో దోహదపడుతుంది. కనుక ఉదయం అరటి పండును తింటే మనకు శక్తి లభిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అంత సులభంగా అలసిపోరు. అరటి పండ్లను తినడం వల్ల మన శరీరంలో సెరొటోనిన్, డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి హిమోగ్లోబిన్ ను తయారు చేసేందుకు కూడా ఉపయోగపడతాయి. రోజూ ఉదయం అరటి పండును తింటుంటే శరీరంలో విటమిన్ బి6 లెవల్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
అరటి పండ్లలో సహజసిద్ధమైన ఫైబర్ ఉంటుంది. ఇది విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అరటి పండులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు.
అరటి పండ్లలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చర్మం మీద ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. రోజుకు ఒక అరటి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అరటి పండులో ఉండే ఫైబర్, సహజసిద్ధమైన చక్కెర నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. దీని వల్ల మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో అతిగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
అరటి పండ్లలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. అందువల్ల గుండె పనితీరును ఇవి మెరుగు పరుస్తాయి. రోజూ ఒక అరటి పండును తింటుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇలా అరటి పండును రోజుకు ఒకటి చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.