Green Moong Dal | మనకు తినేందుకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది మాత్రం జంక్ ఫుడ్‌నే తింటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు బేకరీలలో ఐటమ్స్ లేదా బజ్జీలు, పునుగులు వంటి చిరు తిండ్లను తింటున్నారు. వీటి వల్ల తాత్కాలికంగా మనకు జిహ్వా చాపల్యం అయితే తీరుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు సరికదా.. అనారోగ్య సమస్యలనే కలిగిస్తాయి. దురదృష్టవశాత్తూ చాలా మంది అనారోగ్య కరమైన ఆహారాలనే రోజూ తింటున్నారు. అయితే సాయంత్రం సమయంలో అలాంటి జంక్ ఫుడ్స్‌కు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. ఇక ఈ రెండింటినీ అందించే ఆహారాల్లో పెసలు చాలా ముఖ్యమైనవని చెప్పవచ్చు. పెసలను రోజూ మొలకెత్తించి తినవచ్చు. లేదా ఉడకబెట్టి తినవచ్చు. ఎలా తిన్నా సరే పెసల వల్ల మనకు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పెసలను రోజూ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. వీటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. పెసలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. పెసలలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదపడుతుంది. పెసలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజూ పెసలను ఉడకబెట్టి తింటే ఎంతో ఫలితం ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కడిగేసినట్లు క్లీన్ అవుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడి ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
పెసలను రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి సమస్య ఉండదు. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పెసలలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పెసలను తింటే శరీరానికి పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. దీంతో హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పెసలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కణాలను రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెసలను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు డయాబెటిస్ లేని వారికి అది వచ్చే రిస్క్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిని తింటే గర్భంతో ఉన్న మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. బిడ్డకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఇవి శిశువు ఎదుగుదలకు దోహదం చేస్తాయి. పెసలను తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా పెసలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.