Bitter Gourd Leaves | కాకరకాయలను చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. చేదుగా ఉంటాయన్న కారణం వల్ల వీటిని తినేందుకు ఆసక్తిని చూపించరు. కానీ కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే కేవలం కాకరకాయలు మాత్రమే కాదు, వీటి ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన దేశంతోపాటు పలు ఆసియా దేశాల వాసులు, ఆఫ్రికా దేశాలు, కరేబియన్ దీవులకు చెందిన ప్రజలు కాకర ఆకులను కూడా తింటుంటారు. కాకర ఆకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి పలు వ్యాధులను నయం చేయడంలో సహాయం చేస్తాయి. మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాకర ఆకులను కూడా తరచూ తినాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఇవి అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయని అంటున్నారు.
కాకర ఆకులను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కాకర ఆకుల్లో కారాంతిన్, పాలిపెప్టైడ్-పి, విసిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ ఉన్నవారు తరచూ ఈ ఆకులను తింటుంటే మేలు జరుగుతుంది. కాకర ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫినోలిక్ యాసిడ్లు, ట్రైటర్పినాయిడ్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
కాకర ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ ఆకులను తింటే జీర్ణవ్యవస్థలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. కాకర ఆకులలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. కాకర ఆకులు లివర్ కు టానిక్‌లా పనిచేస్తాయి. ఈ ఆకులను తింటే లివర్ వాపులు తగ్గిపోతాయి. లివర్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు వెళ్లి లివర్ శుభ్రంగా మారుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
కాకర ఆకులు కూడా కాయల్లాగే చేదుగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు ఎవరూ ఆసక్తిని చూపించరు. కానీ కాస్త చేదును తగ్గించుకుంటే ఈ ఆకులను తినవచ్చు. కాకర ఆకులతో జ్యూస్ తయారు చేసి రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా భోజనానికి 30 నిమిషాల ముందు 30 ఎంఎల్ మోతాదులో ఆ రసాన్ని తాగవచ్చు. లేదా ఈ ఆకులతో నేరుగా కూర చేసుకుని వండి తినవచ్చు. ఇతర కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. సూప్‌లు, చారు వంటి వాటిల్లోనూ ఈ ఆకులను వేసుకోవచ్చు. ఈ ఆకులతో టీ తయారు చేసి తాగవచ్చు. ఇక లో షుగర్ సమస్య ఉన్నవారు, గర్భిణీలు ఈ ఆకులను తినకూడదు. కాకర ఆకులపై క్రిమి సంహారక మందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ ఆకులను బాగా శుభ్రం చేసిన తరువాతే ఉపయోగించాలి. ఇలా కాకర ఆకులను తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.