Banana Stem | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అనారోగ్యం బారిన పడిన వారు శక్తి కోసం అరటి పండ్లను తింటుంటారు. అయితే కేవలం అరటి పండ్లు మాత్రమే కాదు, అరటి కాడలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. అరటి కాడలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. 100 గ్రాముల అరటి కాడలను తింటే సుమారుగా 16 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం అసలే ఉండవు. పిండి పదార్థాలు చాలా తక్కువగా కేవలం 2 గ్రాములు మాత్రమే ఉంటాయి. అరటి కాడల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్లు బి6, సి, బి3లతోపాటు పొటాషియం, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల అరటి కాడలను కూడా రోజూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అరటి కాడలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అరటి కాడలు ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పొట్టలో ఏర్పడిన అసౌకర్యం తగ్గుతుంది. అరటి కాడలను తింటే అజీర్తి, అసిడిటీ, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పైల్స్ ఉన్నవారికి ఈ కాడలు ఎంతగానో మేలు చేస్తాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లను సైతం తగ్గిస్తాయి. అరటి కాడల్లో క్యాలరీలు చాలా స్వల్పంగా ఉంటాయి. కొవ్వు అసలే ఉండదు. పైగా పైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ కాడలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
అరటి కాడ సహజసిద్ధమైన డై యురెటిక్గా పనిచేస్తుంది. ఇది మూత్రం ధారాళంగా వచ్చేలా చేస్తుంది. దీంతో మూత్రం ద్వారా వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరంలో అదనంగా ఉండే ద్రవాలు బయటకు విసర్జించబడతాయి. దీంతో కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. అరటి కాడల్లో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా చూస్తుంది. కిడ్నీ స్టోన్లు లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు, మూత్రంలో మంట వస్తున్నవారు అరటి కాడలను తింటుంటే చక్కని ఫలితం ఉంటుంది. అరటి కాడల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి అరటి కాడలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తింటే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అరటి కాడల్లో అధికంగా ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్దాయిలను మెరుగ్గా నిర్వహిస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు అరటి కాడలను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించేందుకు కూడా అరటి కాడలు పనిచేస్తాయి. వీటిని తింటుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా అరటి కాడలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.