న్యూఢిల్లీ : రోజు ఆరంభంలో మనం తీసుకునే ఆహారం ఆరోజంతా మనం ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండేందుకు తోడ్పటమే కాకుండా జీవక్రియల వేగాన్నీ ప్రభావితం చేస్తుంది. అంతటి ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఏదో తిన్నామా.. రోజువారీ పనులకు పరిగెత్తామా అన్నట్టు కాకుండా మన ఆరోగ్యానికి ఉపకరిస్తుందా లేదా అనేది పరిశీలించాలి. బిజీబిజీ జీవితంలో ఇటీవల ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు బ్రేక్‌ఫాస్ట్‌గా తరచూ సిరియల్స్ తీసుకుంటున్నారు.
పాలల్లో నానిన పోర్టిఫైడ్ సిరియల్స్ను తినేసి బ్రేక్‌ఫాస్ట్ అయిందనిపిస్తున్నారు. వీటిని నిత్యం తీసుకుంటే చర్మం నిగారింపు కోల్పోయి వృద్ధాప్య ఛాయలను తీసుకువస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. వీటిలో కలిపే చక్కెరలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు శరీరంలో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయని, ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంది. దీర్ఘకాలంలో ఇవి గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.
ఎముకలు, నరాలు బలహీనపడి వృద్ధాప్యం ముంచుకొస్తుందని స్కిన్ థెరఫీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. వీటిలో దాగుండే రిఫైన్డ్ చక్కెరలు, రిఫైన్డ్ ఫ్లోర్, ఇతర ప్రిజర్వేటివ్‌లు, సంతృప్త కొవ్వులతో ఒబెసిటీ ముప్పు ఉంటుందని, జీవక్రియలు అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓట్ మీల్, పోహా, ఢోక్లా, ఎగ్స్, పండ్లు, అవిసె గింజలు, బెర్రీస్, పెరుగు, తక్కువ నూనె వాడుతూ పరోటాలను బ్రేక్పాస్ట్గా తీసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.