Egg and Heart health | ప్రస్తుతం కోడిగుడ్డు వినియోగం పెరిగింది. దాంతో వాటి ధరలు కూడా పెరిగాయి. కోడిగుడ్డును ఎలాంటి ఆహారంతోనైనా జత చేసి తినేందుకు వీలున్న ఒకే ఒక ఆహారంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లు తినడం చాలా ప్రాంతాల్లో అలవాటుగా ఉన్నది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. 6 గ్రాముల ప్రోటీన్‌తో పాటు 78 క్యాలరీల శక్తి ఒక గుడ్డు నుంచి అందుతుంది. ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనకు నిత్యం 0.8 నుంచి 1 గ్రాము వరకు ప్రోటీన్ అవసరమవుతుంది. అందుకని మనం నిత్యం ఒకటి లేదా రెండు కోడిగుడ్లు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్డు వినియోగం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నపై కొత్త అధ్యయనం సమాధానం ఇచ్చేందుకు కృషిచేసింది. ఈ పరిశోధన పత్రం న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. బోస్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 2,300 కంటే ఎక్కువ మంది పెద్దవారి డాటాను అధ్యయనం చేశారు. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని వారు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా రోజుకు ఒక గుడ్డు లేదా రెండు గుడ్లను కేవలం తెల్లసొనతో తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు చేస్తున్నది. గుడ్లలో ఉండే ప్రోటీన్, ఇతర పోషకాలు మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. హెచ్‌డీఎల్ స్థాయి మెరుగవుతుంది. ట్రైగ్లిజరాయిడ్ల మోతాడు తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ట్రైగ్లిజరాయిడ్లను పొందాంటే నిత్యం రెండు కోడిగుడ్లు తినడం అలవాటు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు.
గుడ్డులో విటమిన్ ఏ – 6 శాతం, విటమిన్ బీ5 – 7 శాతం, విటమిన్ బీ12 – 9 శాతం, విటమిన్ బీ2 – 15 శాతం, ఫాస్పరస్ – 9 శాతం, సెలేనియం – 22 శాతం ఉంటాయి. పప్పు, మాంసాహారంలోని ప్రోటీన్ల కంటే గుడ్డులోని ప్రోటీన్లు తేలికగా జీర్ణమవుతాయి. గుడ్డులోని కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా ఇందులోని లెసిఫిన్ వంటివి కాపాడతాయి. తెల్లసొనలో 90 శాతం నీరుండి.. మిగతా 10 శాతంలో అల్బుమిన్, గ్లొబిలిన్ వంటి ప్రోటీన్లు ఉంటాయి. అలాగే, వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.