Cervical Cancer Study | మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ సర్వసాధారణమైన క్యాన్సర్స్. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లోనూ ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నది. గణాంకాల ప్రకారం.. ఈ క్యాన్సర్ ప్రతి ఐదు కేసుల్లో ఒకటి భారత్‌లో నమోదవుతున్నది. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)కి సంబంధించిన వివిధ జాతులు ఈ క్యాన్సర్‌కు కారణమవుతాయి.
అయితే, టీకా ద్వారా ఈ ఇన్షెక్షన్ను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌పీవీకి మూడు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షించడంలో సహాయ పడుతుంది. అయితే, వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకున్నా అది ఇన్ఫెక్షన్, దాని వల్ల వచ్చే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం నుంచి కాపాడుతుందని ఇటీవలి అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. టీకా ఒక్క మోతాదు సైతం 98శాతం వరకు రక్షణ అందిస్తుందని, దాంతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు మహిళలు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కెన్యాలోని 2,275 మంది మహిళల్లో టీకా ప్రభావాన్ని నిపుణులు పరీక్షించారు. టీకా మొదటి డోస్ 18 నెలల తర్వాత కూడా, రెండు HPV జాతులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ 97.5 శాతం ప్రభావవంతంగా పని చేసిందని పరిశోధకులు గుర్తించారు. అయితే, నాన్బివాలెంట్ టీకాలు ఏడు జాతులకు వ్యతిరేకంగా 89 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు. HPV ఓ ఓ వేరియంట్ మహిళలకు సంక్రమించినప్పటికీ, టీకా వైరస్, ఇతర జాతుల నుంచి రక్షణ కల్పిస్తుందని పరిశోధనకులు తేల్చారు.
NEJM జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇటీవల 35వ అంతర్జాతీయ పాపిల్లోమావైరస్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. సియాటిల్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ అయిన స్టడీ లీడర్ డాక్టర్ రువాన్ బర్నాబాస్ మాట్లాడుతూ హెచ్‌పీవీ టీకా సింగిల్ డోస్ సైతం ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు. మూడు డోసులు తీసుకున్న ఫలితం ఉంటుందని చెప్పారు. అయితే, ఎక్కువ జనాభాకు ఒక డోస్ టీకా ఇచ్చినా ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మందికి మాత్రమే పాపిల్లోమా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి 90శాతం మంది 15 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్‌ను అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ముప్పు అని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నివారణలో టీకా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని, టీకాలపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
HPV వైరస్‌తో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను తగ్గించడంలో టీకా ముఖ్యమైన పాత్రను పోషించగలిగే గేమ్ ఛేంజర్ అని కెన్యా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సామ్ కుర్కి పేర్కొన్నారు. అయితే, వివిధ వర్గాల ప్రజలలో టీకాలు ఎంతకాలం ప్రభావవంతంగా ఉంటాయో తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు. వైరస్ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళను చంపుతోందని, HPV టీకాలు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక శక్తివంతమైన సాధనమని సామ్ కుర్కి పేర్కొన్నారు.