Refined Flour | మైదా (Refined Flour) మనకు తెలియకుండానే రోజువారీ ఆహారంలో భాగమైపోయిన పదార్థం. బ్రెడ్, బిస్కెట్లు, నూడుల్స్, కేకులు, పేస్ట్రీలు వంటి అనేక వంటకాలలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రుచిగా ఉన్నప్పటికీ, ఇందులో పోషకాలు తక్కువగా ఉండటం, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, ఆరోగ్య నిపుణులు దీనిని పరిమితం చేయాలని సూచిస్తున్నారు. అందుకే కొందరు కొంతకాలం మైదాను పూర్తిగా మానేసి శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తున్నారు. కేవలం రెండు వారాల పాటు మైదా తీసుకోకుండా ఉంటే కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మైదాను ఆహారం నుంచి తొలగించడంతో జీర్ణక్రియలో మెరుగుదల కనిపిస్తుంది. ఫైబర్ లేని మైదా జీర్ణక్రియను మందగింపజేస్తుంది. దానికి బదులుగా సంపూర్ణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఉబ్బరం తగ్గి, పొట్ట తేలికగా అనిపిస్తుంది. అలాగే శక్తి స్థాయిలు స్థిరంగా మారుతాయి. మైదాతో తయారైన పదార్థాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచి, వెంటనే తగ్గిస్తాయి. దీంతో అలసట, నీరసం వస్తాయి. మైదా మానేయడం వల్ల ఈ మార్పులు తగ్గి, శక్తి స్థాయి సంతులితంగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలోకి వస్తుంది. మైదా ఎక్కువసేపు తృప్తిని ఇవ్వదు కాబట్టి తరచూ తినాలనిపిస్తుంది. కానీ ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటే ఎక్కువసేపు నిండుగా అనిపించి అనవసరంగా తినడం తగ్గుతుంది. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది.
మైదా పదార్థాల్లో ఎక్కువగా ఖాళీ క్యాలరీలు, చక్కెరలు, కొవ్వు ఉంటాయి. వీటిని తగ్గించడం వల్ల అదనపు క్యాలరీలు తగ్గి, కొంతవరకు బరువు నియంత్రణలోకి వస్తుంది. ఉబ్బరం కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. చర్మంపై కూడా స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ప్రాసెస్డ్ ఆహారం తగ్గించడంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి, మొటిమలు లేదా చర్మ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మైదా మానేసిన మొదటి రోజుల్లో తినాలనే కోరికలు పెరగవచ్చు. ముఖ్యంగా బ్రెడ్, బేకరీ పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి ఇది సహజమే. అయితే కొద్ది రోజుల్లోనే శరీరం అలవాటు పడడంతో ఈ కోరికలు తగ్గిపోతాయి. మైదా పిండిని మానేయడం వల్ల ఈ విధంగా మన శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మైదాను మానేటప్పుడు దానికి బదులుగా సంపూర్ణ గోధుమలు, జొన్నలు, రాగులు, ఓట్స్, పప్పులు వంటి పోషకాహారం తీసుకోవడం అవసరం. కేవలం మైదాను మానేయడం సరిపోదు, మొత్తం ఆహార నాణ్యతను మెరుగుపరచడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రెండు వారాల పాటు మైదాను దూరం పెట్టడం ద్వారా శరీరంలో వచ్చే చిన్న మార్పులను గమనించవచ్చు. ఇది కఠిన నియమం కాదు, కానీ మన ఆహారం శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకునేందుకు మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు.