Skin Health | చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే కేవలం ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు వాడటం మాత్రమే సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మంపై రాసుకునే క్రీములు, సీరమ్లతోపాటు రోజువారీ ఆహారంలో ఉండే పోషకాలు కూడా చర్మ ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి. సరైన పోషకాహారం చర్మానికి లోపలి నుంచి పోషణ అందించి సహజమైన మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇటీవలి పరిశోధనల ప్రకారం మనం తీసుకునే ఆహారం శరీరంలోని వాపు (ఇన్ఫ్లమేషన్) స్థాయిని, అలాగే చర్మ రక్షణ పొర (స్కిన్ బ్యారియర్) పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ రెండు అంశాలు చర్మ ఆరోగ్యం, తేమ, మృదుత్వం, కాంతిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందుకే స్కిన్కేర్తోపాటు సమతుల్యమైన ఆహారానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సార్డిన్స్ చేపలు, అవకాడో కలయిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. సార్డిన్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (EPA, DHA) సమృద్ధిగా ఉండటంతో ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మ కణాల ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్-డి, సెలీనియం కూడా ఇందులో లభిస్తాయి. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు చర్మ రక్షణ పొరను బలపరచడంలో సహాయపడతాయి. దీంతో చర్మం తేమను ఎక్కువసేపు నిల్వ చేసుకుని పొడిబారకుండా ఉంటుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం, సూర్యకిరణాలు వంటి పర్యావరణ ప్రభావాల నుంచి చర్మ కణాలను రక్షించడంలో దోహదపడతాయి. చర్మం బిగుతుగా, మృదువుగా, కాంతివంతంగా కనిపించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
సార్డిన్స్, అవకాడో కలయిక ఒకే సమయంలో శరీరంలోని వాపును నియంత్రించడంతోపాటు చర్మ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను అందిస్తుంది. అందుకే చర్మ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారు ఈ ఆహారాలను తమ డైట్లో చేర్చుకోవడం ప్రారంభించాలి. అయితే ఒక్క ఆహారం తిన్నంత మాత్రాన రాత్రికి రాత్రే చర్మం మెరుస్తుందని భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సరైన నిద్ర, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మాత్రమే చర్మం దీర్ఘకాలంలో ఆరోగ్యంగా, సహజమైన కాంతితో కనిపించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.