Birth Control Pills | గర్భం రాకుండా చూసుకోవడానికి చాలా మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మనకు తెలిసిందే. పిల్లలు వద్దనుకునే వారు బర్త్ కంట్రోల్ పిల్స్ తీసకుంటున్నారు. గర్భనిరోధక మాత్రలో ఒక మాదిరి సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరగకుండా ఆపుతుంది. ఇది తాత్కాలిక పద్ధతే. ఒక రకంగా వీటితో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటి వాడకంతో పలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు సెలవిస్తున్నారు. బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలుసుకున్న తర్వాతనే ఈ పిల్స్ వాడితే మహిళలు తమ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకోగలుగుతారని చెప్తున్నారు.
వికారం..
గర్భనిరోధక మాత్ర తీసుకున్న తర్వాత చాలా మందిలో వికారంగా ఉండే సమస్యను ఎదుర్కొంటుంటారు. శరీరంలో హార్మోన్ల పెరుగుదల వల్ల వికారం సంభవిస్తుంది. వికారం అనుభవించే వారిలో తలతిరగడం వంటి సమస్య కూడా ఎదురవుతుంది. కడుపు నొప్పి కూడా కనిపిస్తుంది. తలనొప్పి అనేది గర్భనిరోధక మాత్ర దుష్ప్రభావం కూడా కావచ్చు. గర్భనిరోధక మాత్రలు తీసుకునేటప్పుడు తలనొప్పులను ఎదుర్కొనే వారు ఇతర గర్భనిరోధక పద్ధతులకు మారడం గురించి ఆలోచించడం ఉత్తమం.
మూడ్ స్వింగ్..
గర్భ నిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల మూడ్ లేదా లిబిడోలో మార్పులు కూడా సంభవిస్తాయి. కొంతమంది ఈ మాత్రలు తీసుకునేటప్పుడు డిప్రెషన్‌ను అనుభవిస్తుంటారు. మరికొందరిలో లిబిడో తగ్గడం లేదా ఉద్రేకం పొందడంలో ఇబ్బంది కనిపిస్తుంది. ఈ దుష్ప్రభావాలను అనుభవించే వారు వేరే రకమైన గర్భనిరోధక పద్ధతికి మారడం లేదా తీసుకుంటున్న మందుల మోతాదును సర్దుబాటు చేయడం గురించి వైద్యులతో చర్చించాలి.
బరువులో మార్పు..
గర్భనిరోధక మాత్రలు వాడేవారిలో శరీర బరువులో ఆకస్మిక మార్పు కనిపిస్తుంది. ఈ మాత్రల్లో ఉండే ప్రొజెస్టిన్ ఆకలిని పెంచుతుంది. దాంతో అవసరానికి మించి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందిలో రొమ్ము సున్నితత్వం లేదా వాపు వంటివి కనిపిస్తాయి. మరికొందరి శరీరంలో హార్మోన్ల మార్పుల ఫలితంగా బరువు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు మరో విధానంలోకి మారడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
హార్ట్ ఎటాక్, స్ట్రోక్.
అరుదైన సందర్భాల్లో గర్భనిరోధక మాత్రలు రక్తం గడ్డకట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. రక్తం గడ్డకట్టడం, గుండె జబ్బులు లేదా స్ట్రోక్ హిస్టరీ ఉన్న వారు బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోకూడదు. గర్భనిరోధక మాత్రలు తీసుకునేటప్పుడు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాలు వాపు లేదా తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి.
గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారిలో ఒత్తిడి, అనారోగ్యం, హార్మోన్లలో అసమానతలు తదితర కారణాల వల్ల రుతు క్రమంలో మార్పులు వస్తాయి. అదే సమయంలో రుతుస్రావంలో అధికంగా రక్త స్రావం కావటం, 6 నుంచి 7 రోజుల పాటు రుతుస్రావం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ పిల్స్ మరీ ఎక్కువగా వినియోగిస్తే అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోతుందని వైద్యులు చెప్తున్నారు. మధుమేహం, పొగ తాగే అలవాటు ఉన్న స్త్రీలు ఈ గర్భనిరోధక మాత్రలు వాడకపోవటమే మేలు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పాటు మాత్రలు తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.