మా పిల్లవాడి వయసు 3 సంవత్సరాలు. ఇప్పటివరకు వేయించాల్సిన అన్ని రకాల టీకాలు వేయించాం. కొత్తగా బ్రెయిన్ ఫీవర్‌కి టీకా వచ్చిందట. ఇప్పుడు ఆ టీకా మా బాబుకు ఇప్పించమని డాక్టర్ అంటున్నారు. ఈ వ్యాక్సిన్ అవసరమా?
మీరు చెప్పే వివరాల ప్రకారం బ్రెయిన్ ఫీవర్ (జపనీస్ ఎన్సెఫలైటిస్) అంటే.. మెదడువాపు వ్యాధి గురించి చెబుతున్నట్టు ఉన్నారు. మెదడువాపు పిల్లల్లో తీవ్రమైన జబ్బు కలుగజేస్తుంది. దీని ప్రభావం వల్ల నరాలు బలహీనపడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. మెదడువాపు వ్యాధికి నిర్దిష్టమైన మందులు లేవు. రోగి సమస్యలను బట్టి తగిన చికిత్స అందిస్తున్నారు. దీనికి టీకా అందుబాటులోకి వచ్చింది. మెదడువాపు వైరస్ వల్ల కలుగుతుంది. దోమకాటు ద్వారా ఆ వైరస్ సోకుతుంది. ఈ మెదడువాపు వ్యాధి భారతదేశంలో కొన్ని రాష్ర్టాల్లో ప్రబలంగా ఉంది. ఆ రాష్ర్టాలన్నిటినీ కలిపి ఎండెమిక్ ఏరియా అంటారు. తెలంగాణ కూడా ఎండెమిక్ ఏరియాలోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి అధికంగా సోకుతుంది. పిల్లల్ని దోమలు కుట్టకుండా కాపాడుకోవడం మంచిది. అయినా వ్యాధి రాదనే భరోసా లేదు. కాబట్టి మెదడువాపు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదే. ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సిన్లను ఇస్తున్నది. మీ బాబుకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదే.