Pacemaker | ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బు కేసులు పెరుగుతుండడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఇటీవలకాలంలో ముఖ్యంగా కొవిడ్ మహ్మమారి తర్వాత గుండెపోటు, గుండె వైఫల్యం వంటి గుండె సంబంధిత సమస్యలు భారీగా పెరిగాయి. అయితే, గుండె సంబంధిత మరణాలను తగ్గించేందుకు వైద్యరంగంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. వాటితో రోగులకు గతంలో కంటే సులభంగా చికిత్స అందించడం సాధ్యమైంది. అయితే, వీటిని ఉపయోగించేందుకు ప్రమాదాన్ని కాలంలోనే గుర్తించాల్సిన అవసరం ఉంది. తాజా శాస్త్రవేత్తలు మరో అద్భుతమైన విజయం సాధించారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు మైక్రో పేస్‌మేకర్‌ను తయారు చేశారు. దాంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనున్నది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పేస్‌మేకర్ బియ్యపు గింజ అంత పరిమాణంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పేస్మేకర్లలో అత్యంత చిన్నది ఇదే కావడం విశేషం. అలాగే, ప్రస్తుతం ఉన్న పేస్మేకర్లను అమర్చిన విధంలో కాకుండా.. మైక్రో పేస్‌మేకర్‌ను ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి సులభంగా ఇంజెక్ట్ చేయొచ్చు.
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం నివేదిక ప్రకారం.. నార్త్ వెస్త్రన్ విశ్వవిద్యాలయం ఇంజినీర్లు సిరంజి కొన లోపల అమర్చగలిగేంత చిన్న పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు. దాంతో పాటు ఎలాంటి శస్త్ర చికిత్స అవసరమే లేకుండా శరీరంలోకి దీన్ని సులభంగా ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఏ పరిమాణంలో ఉన్న గుండెకైనా ఇది పని చేస్తుంది. పుట్టకతో గుండె లోపాలున్న నవజాత శిశువుల చిన్న, సున్నితమైన గుండెకు సైతం అనుకూలంగా ఉంటుంది. వాస్తవానికి పేస్ మేకర్ గుండె సాధారణ వేగం, లయతో కొట్టుకునేందుకు సహాయపడుతుంది. ఇది ప్రధానంగా అరిథ్మియా ఉన్నవారిలో చికిత్స కోసం ఉపయోగిస్తారు. కొందరిలో హృదయ స్పందన చాలావేగంగా.. లేదంటే నెమ్మదిగా ఉంటుంది. దీన్ని నియంత్రించేందుకు పేస్మేకర్లను ఉపయోగిస్తారు. పేస్మేకర్లను సాధారణంగా అనస్థీషియా ఇచ్చి శస్త్ర చికిత్స చేసి శరీరంలోకి అమర్చుతారు. చిన్నవి, మరింత కాంపాక్ట్‌గా ఉండే లీడ్లెస్ పేస్మేకర్లను కాథెటర్ ఉపయోగించి నేరుగా గుండెలోకి చొప్పిస్తారు. అయితే, కొత్త పేస్ మేకర్‌ను మాత్రం ఇంజెక్షన్ ద్వారా సులభంగా శరీరంలోకి ప్రవేశపెట్టవచ్చని అధ్యయనం పేర్కొంది. పేస్‌మేకర్ అవసరం తీరిపోయాక అది ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది.
అధ్యయనం ప్రకారం.. చిన్న పేస్‌మేకర్ మృదువైన, వైర్లెస్ డివైజ్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇది పేసింగ్‌ను నియంత్రించేందుకు రోగి ఛాతిపై అమరుస్తారు. దాంతో హృదయ స్పందనలో మార్పులు గమనించిన సమయంలో ఈ పరికరం దాన్ని వెంటనే గుర్తించి.. సరిగా ఉండేలా చూస్తుంది. తాత్కాలిక పేసింగ్ మాత్రమే అవసరమయ్యే రోగుల కోసం దీన్ని రూపొందించినట్లు వైద్య నిపుణుల బృందం తెలిపింది. దాని అవసరం ముగిసిన సమయంలో ఈ పేస్‌మేకర్ ఆటోమేటిక్‌గా శరీరంలోనే కరిగిపోతుందని పేర్కొంది. ఈ పేస్‌మేకర్ అన్ని భాగాలు బయో కాంపాజిబుల్ కాబట్టి అవి సహజంగా శరీరంలోని బయోఫ్లూయిడ్లలో కరిగిపోతాయని.. ప్రత్యేకంగా మళ్లీ శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అధ్యయనం ప్రధాన రచయితల్లో ఒకరైన యూఎస్‌లోని మెక్కార్మిక్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఇగర్ ఎఫిమోబ్ మాట్లాడుతూ.. ఈ పేస్‌మేకర్ పిల్లల్లో గుండె సమస్యలకు చాలా ప్రభావంతంగా పని చేస్తుందన్నారు. దాదాపు ఒకశాతం మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత లోపాలతో జన్మిస్తున్నారన్నారు. పిల్లల్లో తాత్కాలిక వేగం మాత్రమే అవసరమని.. ఏడురోజుల్లో నయమవుతాయని.. కానీ, ఈ ఏడురోజులే కీలకమన్నారు. పేస్‌మేకర్ అవసరం తీరాక.. శరీరంలోనే కరిగిపోతుందన్నారు.