Cartilage | వయసు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులు, కీళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆస్టియోఆర్థ్రైటిస్ కారణంగా కీళ్లలోని కార్టిలేజ్ క్రమంగా తగ్గిపోవడం వల్ల నడవడం కూడా కష్టమవుతోంది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకవచ్చనే ఆశలను పెంచుతూ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలకమైన పరిశోధన ఫలితాలను వెల్లడించారు. శాస్త్రవేత్తలు 15-పీజీడీహెచ్ అనే ఒక ప్రత్యేక ప్రోటీన్ వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా పనిచేస్తూ కీళ్లలోని కార్టిలేజ్‌ను దెబ్బతీస్తుందని గుర్తించారు. ఈ ప్రోటీన్ శరీరంలో టిష్యూలను మరమ్మత్తు చేసే, ఇన్ఫ్లమేషన్ను తగ్గించే సహజ ప్రక్రియలను అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా ఈ ప్రోటీన్ పనిచేయకుండా చేసే ఔషధాన్ని వృద్ధ ఎలుకలకు ఇవ్వగా, దెబ్బతిన్న మోకాలి కార్టిలేజ్ మళ్లీ మందంగా మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అలాగే చిన్న వయసు ఎలుకల్లో గాయాల తర్వాత వచ్చే ఆస్టియో ఆర్థ్రైటిస్ను కూడా ఈ చికిత్స పూర్తిగా అడ్డుకుందని తెలిపారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పునరుద్ధరణకు స్టెమ్ సెల్స్ అవసరం రాలేదని పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న కార్టిలేజ్ కణాలు అయిన కాండ్రోసైట్స్ను మళ్లీ ఆరోగ్యకర స్థితికి మార్చడం ద్వారా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. చికిత్స పొందిన ఎలుకలు మెరుగ్గా నడవడమే కాకుండా గాయపడిన కాళ్లపై ఎక్కువ బరువు పెట్టగలిగాయని, దీని వల్ల నొప్పి కూడా తగ్గినట్లు గుర్తించారు.
ఈ ప్రయోగాలను మనుషుల కీళ్ల టిష్యూలపై కూడా పరీక్షించారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల కార్టిలేజ్ నమూనాల్లో కొత్త కార్టిలేజ్ పెరుగుదలతోపాటు ఇన్ఫ్లమేషన్ తగ్గిన సంకేతాలు కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇటీవల కీళ్ల ఆరోగ్యంపై మరికొన్ని ఆసక్తికరమైన పరిశోధనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మధుమేహం, బరువు తగ్గించే మందుగా ప్రసిద్ధి చెందిన ఒజెంపిక్ లో ఉండే సెమాగ్లుటైడ్ కార్టిలేజ్ కణాల పనితీరును మెరుగుపరచి కీళ్లను రక్షిస్తుందని మరో అధ్యయనం సూచించింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ శాస్త్రవేత్తలు కొన్ని వారాల్లోనే ఆస్టియోఆర్థ్రైటిస్ను తగ్గించే ఇంజెక్షన్ చికిత్సపై పనిచేస్తున్నారు. 15-పీజీడీహెచ్ ప్రోటీన్‌ను అడ్డుకునే ఔషధంపై ఇప్పటికే భద్రతా పరీక్షలు కూడా పూర్తయ్యాయని, ఇప్పటివరకు పెద్దగా దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. త్వరలోనే మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.