Rosemary Tea | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మీరు తాగే టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలను తాగాలని వైద్యులు చెబుతుంటారు. అందులో భాగంగానే మనకు అనేక రకాల హెర్బల్ టీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే హెర్బల్ టీ అనగానే ఏ తరహా హెర్బల్ టీని సేవించాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టీ ఎంతో మేలు చేస్తుంది. అదే రోజ్మేరీ టీ. దీన్ని మనం బయట షాపుల్లో లేదా సూపర్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లోనూ లభిస్తుంది. రోజ్మేరీ ఆకులతో ఈ హెర్బల్ టీ పొడిని తయారు చేస్తారు. దీని సహాయంతో టీ తయారు చేసి తాగితే అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. రోజ్మేరీ టీ లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
రోజ్మేరీ టీలో రోజ్మెరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్, కెఫియిక్ యాసిడ్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా గుండె పోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. రోజ్మేరీ టీని రోజూ సేవించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ టీలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
రోజ్మేరీ టీని సేవించడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వాపులు తగ్గిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మెదడు చురుగ్గా మారి యాక్టివ్‌గా ఉంటుంది. ఈ టీలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. చుండ్రు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ ఫలితం లభించాలంటే మనకు రోజ్మేరీ ఆయిల్ కూడా లభిస్తుంది. దీన్ని జుట్టుకు నేరుగా అప్లై చేయవచ్చు. ఇలా చేస్తున్నా కూడా ప్రయోజనం ఉంటుంది.
రోజ్మేరీ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌కు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. లివర్‌లో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లేలా చేస్తాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. రోజ్మేరీ టీలో కాంఫీన్, కార్నోసోల్ అనే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని, ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఈ టీని సేవిస్తుంటే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. రోజ్మేరీ టీలో యాంటీ ప్లేట్లెట్ గుణాలు ఉంటాయి. అందువల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకోవచ్చు. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇలా రోజ్మేరీ టీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.