‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అంటారు. మన శరీర అవయవాలన్నిటిలో కండ్లు చాలా ప్రధానమైనవి. కారణాలేవైనా సరే కంటిచూపు లేకపోతే మనం ఈ వైవిధ్య భరితమైన ప్రపంచాన్ని చూడలేం. జీవితం అంధకార బంధురమైపోతుంది. అంతటి విలువైన కంటిచూపును అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ, కొన్ని సందర్భాల్లో కొంతమందికి పుట్టుకతోనే చూపు ఉండదు. మరికొంతమంది శిశువులు కంటిచూపుతో జన్మిస్తారు కానీ, కంట్లో అంతర్గత అవయవాలు సరిగ్గా వృద్ధి చెందకపోవడంతో క్రమంగా చూపు కోల్పోతారు. ఇలా కంట్లో అంతర్గత భాగాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడాన్ని రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (ఆర్ఓపీ)అంటారు. ఇలాంటి శిశువుల్లో సమస్యను సకాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే వారిని అంధత్వం బారినపడకుండా కాపాడవచ్చు. అయితే ఆర్ఓపీతో జన్మించే పిల్లలు బయటికి బాగానే కనిపిస్తారు. కానీ, రోజులు గడిచేకొద్దీ వారిని అంధత్వం ఆవహిస్తుంది. శిశువులకు ఇబ్బందికరంగా పరిణమించే ఈ ఆర్ఓపీ పూర్వాపరాల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.
సాధారణంగా నాలుగో వారం నుంచే తల్లి కడుపులో ఉన్న బిడ్డకు అవయవాలు వృద్ధి చెందడం మొదలవుతుంది. కంటి విషయానికి వస్తే 16వ వారం నుంచి రెటీనా వృద్ధి చెందడం ఆరంభమవుతుంది. ఈ రెటీనాతోనే మనం చూడగలం. బయటికి కనిపించే కన్ను ఇతర అన్ని అవయవాలతోపాటు ముందుగానే వృద్ధి చెందుతుంది. అయితే, కంటి లోపలి భాగం ఉండే రెటీనా మాత్రం బిడ్డ పుట్టడానికి ముందు చివరి రెండు వారాల్లో అభివృద్ధి చెందుతుంది. అంటే 38- 39 వారాల నుంచి 40 వారాల మధ్య రెటీనా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. ఇది పరిపూర్ణంగా వృద్ధి చెందితేనే మనకు కంటిచూపు ఉంటుంది. అలా జరగకపోతే చూపు ఉండదు. ఈ క్రమంలోనే 38 వారాల కంటే ముందుగానే జన్మించిన పిల్లల్లో… అంటే నెలలు నిండకుండా పుట్టిన ప్రీటర్మ్ శిశువుల్లో రెటీనా పూర్తిస్థాయిలో వృద్ధి చెందదు. దీనినే ‘రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ’ (ఆర్ఓపీ) వ్యాధి అంటారు. దీని తీవ్రత శిశువు బరువుపైన, ప్రసవ సమయానికి ఎన్ని రోజుల ముందు జన్మించిందో ఆ సమయంపై ఆధారపడి ఉంటుంది.
నెలలు నిండకుండా, తక్కువ బరువుతో జన్మించే పిల్లల్లో ఆర్ఓపీ సమస్య అధికంగా ఉంటుంది. వంద మంది ప్రీమెచ్యూర్ పిల్లలు జన్మిస్తే అందులో కనీసం 50 మందికి ఈ ఆర్ఓపీ సమస్య ఉండే అవకాశాలు ఉంటాయి. కారణం, కంట్లో రెటీనా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడమే. దీన్ని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందివ్వాలి. లేదంటే అంధత్వం తప్పదు.
శిశువు శరీరంలో ఏవైనా అవయవాల్లో లోపాలు ఉంటే ఆ సమస్య బయటికి కనిపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే శిశువు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తెలిసిపోతుంది. వెంటనే చికిత్స అందించవచ్చు. లోపాలున్న సమస్యకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చు. కాని ఆర్ఓపీ సమస్య బయటికి కనిపించదు. శిశువులు నోరు తెరిచి తమ బాధ చెప్పలేరు. అందుకని ఈ సమస్య గురించి ఎవరికీ తెలియదు. మిగిలిన పిల్లల్లానే వీరూ కనిపిస్తారు. కాబట్టి, సమస్యను సకాలంలో గుర్తించడమే ఇక్కడ కీలకంగా నిలుస్తుంది. తగిన చికిత్స అందించకపోతే వారి కంటిచూపు పోతుంది. అందుకే దీన్ని అత్యవసర వ్యాధిగా పరిగణిస్తారు. అందువల్ల పుట్టిన ప్రతి శిశువుకు వెంటనే కంటి పరీక్షలు జరపాలి. అందుకోసం దవాఖానల్లో ఆర్ఓపీ గురించి అవగాహన ఉన్న వైద్యులను ప్రత్యేకంగా నియమించాలి. లేదా కంటి దవాఖానకు సిఫారసు చేయాలి.
ప్రతి ప్రసూతి దవాఖానలో కంటి వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అమెరికా వంటి దేశాల్లో ప్రతి హాస్పిటల్లో కంటి వైద్యులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. కంటి విభాగం లేకపోతే అక్కడ ఏ హాస్పిటల్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వరు.
శిశువు జన్మించినప్పటి నుంచి 30 రోజుల్లోపు సమస్యను గుర్తించి సరైన చికిత్స అందించాలి. లేకపోతే మూడు నాలుగు నెలల్లోనే శిశువు కంటిచూపు శాశ్వతంగా పోతుంది. దీంతో ఆ చిన్నారి జీవితాంతం అంధత్వంతో బాధపడక తప్పదు. ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిది. ఎంత ఆలస్యం చేస్తే సమస్య అంత జటిలంగా మారుతుంది. అంటే ఆర్ఓపీ ప్రభావం పెరిగి శిశువు చూపు దెబ్బతింటుంది.
నెలలు నిండకుండా జన్మించే శిశువుల కండ్లు చూడటానికి సిద్ధంగా ఉంటాయి. అంటే వారి కండ్లలో చూపు ఉంటుంది. అందుకే ఆర్ఓపీ సమస్య ఉన్నదీ లేనిదీ సకాలంలో గుర్తించాలి. తగిన చికిత్సను అందిస్తే సమస్యను 90 నుంచి 95 శాతం వరకు అధిగమించవచ్చు. శిశువులకు సాధారణ వ్యక్తుల్లా చూపు అందించవచ్చు. మూడు నాలుగు నెలలు దాటిపోతే మాత్రం ఆర్ఓపీ పిల్లలకు చూపు రావడం కష్టం.
ఆర్ఓపీ బాధిత శిశువులకు సకాలంలో సరైన చికిత్స అందిస్తే సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు. 90 నుంచి 95 శాతం చూపును రప్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. లేజర్ చికిత్స లేదా ఇంజక్షన్ ఇస్తారు. కొంతమందికి వ్యాధి తీవ్రత ఆధారంగా లేజర్, ఇంజక్షన్ రెండూ ఇవ్వాల్సి రావచ్చు. ఆర్ఓపీ తీవ్రతను తెలుసుకునేందుకు ‘పోరస్ నియోనేటల్ కెమెరా’ ఉపయోగించి శిశువు కంట్లో రెటీనాను ఫొటో తీసి చూస్తారు. అది కాకుండా పెద్దవారి రెటీనాను ఫొటోలు తీసే అట్లాస్ ఆఫ్ ఆర్ఓపీ క్లరస్ అనే కెమెరాతో కూడా శిశువుల రెటీనాను ఫొటో తీయవచ్చు. ఈ పరిజ్ఞానం ప్రపంచంలోనే తొలిసారిగా ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
– మహేశ్వర్రావు బండారి
– డాక్టర్ సుభద్ర జలాలీ న్యూబార్న్ ఐ హెల్త్ అలయన్స్ నెట్వర్క్ డైరెక్టర్