నా భర్త వయసు నలభై ఏడు. నాకు నలభై రెండు. పెండ్లయి ఇరవై ఏండ్లు అవుతున్నది. ఇద్దరు టీనేజ్ పిల్లలుఉన్నారు. నా భర్త ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆకర్షణీయంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. కానీ రెండేండ్ల నుంచీ నాతో శృంగారంలో పాల్గొనడం లేదు. పడకగదిలో ఆ ప్రస్తావన తెస్తేనే మొహం తిప్పుకొంటారు. తెల్లారితే మళ్లీ మామూలుగా ఉంటారు. మరొకరి ఆకర్షణలో పడ్డారేమో అని భయంగా ఉంది. సమస్య ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలవుతున్నది? నేనేం చేయాలి?
ఓ సోదరి
మీ ఆలోచనల్లో తప్పు లేదు. కానీ, రెండేండ్ల క్రితం వరకూ మీ శృంగార జీవితం ఎలా ఉండేదో చెప్పలేదు. ఆధునిక జీవన విధానం కారణంగా కొందరు పురుషుల్లో 45 ఏండ్లకే అంగస్తంభన సమస్య వస్తున్నది. అదే మీ ఇద్దరి మధ్యా అవరోధానికి కారణమైతే.. అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. మీ వారిని ఒప్పించి నిపుణులను సంప్రదించండి. కొందరిలో నాలుగు పదులకే లైంగిక జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడుతుంది.
ఈ కారణాన్నీ కొట్టిపడేయలేం. మాటలతో, చేతలతో ఆకట్టుకోగలిగితే.. మీ భర్త దారికొచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధం గురించి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే, ఇద్దరూ కూర్చుని చర్చించుకుంటే సరిపోతుంది. మీరు అతణ్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే.. మీ ముందు ఓపెన్ అవుతాడు. ఆ నమ్మకాన్ని కలిగించండి చాలు. మీ సమస్యకు మూలాలు తెలుస్తాయి. పరిష్కారమూ దొరుకుతుంది.