Pregnancy Health Problems | గర్భధారణ ప్రతి మహిళ జీవితంలో ఎంతో ఆనందకరమైన దశ. అయితే ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే గర్భధారణ సమయంలో క్రమం తప్పని వైద్య పరీక్షలు, పోషకాహారం, ఆరోగ్యకర జీవనశైలి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తహీనత, అధిక రక్తపోటు, గర్భకాల మధుమేహం వంటి సమస్యలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే విషయంపై నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డేను ఈ సమయంలో నిర్వహిస్తారు. గర్భిణీల ఆరోగ్యం, మాతృ మరణాల తగ్గింపు, సురక్షిత ప్రసవాలపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. సరైన వైద్య సేవలు, గర్భధారణ సమయంలో పరీక్షలు, ప్రసవానంతర సంరక్షణ ప్రతి మహిళకు అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక గర్భధారణ సమయంలో ఎక్కువగా కనిపించే సమస్యల్లో గర్భకాల మధుమేహం ఒకటి. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల శిశువు అధిక బరువుతో పుట్టే అవకాశం ఉండటంతో పాటు ప్రసవ సమయంలో సమస్యలు వస్తాయి. సంపూర్ణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు లేదా ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది గర్భాశయానికి రక్తప్రసరణపై ప్రభావం చూపి ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది. క్రమం తప్పకుండా ప్రీనాటల్ చెకప్‌లు చేయించుకోవడం, ఉప్పు తగ్గించడం, ఒత్తిడిని నియంత్రించడం, శారీరక కదలికలు కొనసాగించడం వంటి చర్యలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
ముఖ్యంగా గర్భిణీల్లో రక్తహీనత సమస్య తలెత్తుతూ ఉంటుంది. శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు లేకపోవడం వల్ల అలసట, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకుకూరలు, పప్పులు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించవచ్చు. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం అవసరం. అదే విధంగా గర్భధారణ సమయంలో కొన్ని ఇన్ఫెక్షన్లు తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI), వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. పరిశుభ్రత పాటించడం, సరైన టీకాలు వేయించుకోవడం, పాక్షికంగా వండిన ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. అంతేకాకుండా గర్భిణీల్లో ముందస్తు ప్రసవం అనే సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. 37 వారాలకు ముందే ప్రసవం ప్రారంభమైతే దాన్ని ముందస్తు ప్రసవంగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన శిశువులకు అభివృద్ధి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు దీనికి కారణమవుతాయి. ఆరోగ్యకర జీవనశైలి పాటించడం, వైద్యుల సూచనలు కచ్చితంగా అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వీటితో పాటు గర్భధారణ ప్రారంభ దశలో గర్భస్రావం జరగడం కూడా చాలామందిలో ఆందోళన కలిగించే అంశం. అన్ని సందర్భాల్లో దీన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. హానికర పదార్థాలకు దూరంగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచడం, సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అధిక వయస్సులో గర్భధారణ, ఊబకాయం వంటి కారణాల వల్ల గర్భధారణ సమస్యలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ సరైన వైద్య పర్యవేక్షణ, క్రమం తప్పని పరీక్షలు, ఆరోగ్యకర జీవనశైలి ద్వారా చాలా సమస్యలను నియంత్రించవచ్చని చెబుతున్నారు.