మా బాబు వయసు ఐదేండ్లు. గత నెలరోజులుగా అప్పుడప్పుడూ ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నివారణ మార్గాలు కూడా తెలియజేయండి?
శిరీష, హైదరాబాద్
నిజానికి, ముక్కు నుంచి రక్తం కారడం అనేది ఒక వ్యాధి కాదు. వివిధ రుగ్మతలలో కనిపించే ఒకానొక లక్షణం. కొన్నిసార్లు రెండువైపుల నుంచీ కారవచ్చు. ఏడాది వయసున్న వారిలో ఇది చాలా అరుదు. స్కూలు వయసు పిల్లల్లో తరచుగా కనిపిస్తుంది. యుక్త వయసులో దానంతట అదే తగ్గిపోతుంది. ముక్కుదూలం కింది భాగంలో, ముందు భాగంలో చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. దీన్నే ‘లిటిల్స్ ఏరియా’ అంటారు. ఆ నాళాలు చాలా మృదువుగా ఉంటాయి. మనం పీల్చిన గాలి మొదట ఈ భాగానికే తాకడం వల్ల వాతావరణంలోని మార్పుల దుష్ప్రభావం ఇక్కడే తీవ్రంగా ఉంటుంది. ఇక ముక్కులో రక్తం కారడానికి అనేక కారణాలు.
పిల్లలు తరచూ ముక్కులో వేలు పెట్టి గిల్లడం వల్ల రక్తనాళాలు చిట్లి రక్తం కారుతుంది. గాయాలు, ఇన్ఫెక్షన్లు, జలుబు, సైన సైటిస్, బలంగా ముక్కు చీదడం, ముక్కులో పెన్సిళ్లు, రబ్బర్లు, ధాన్యపుగింజలు పెట్టుకోవడం, ఎడినాయిడ్స్, తీవ్రమైన చలి, వేడి, ముక్కులో కండరం పెరగడం (పాలిప్), మీసిల్స్, టైఫాయిడ్, రక్తసంబంధ వ్యాధులలో కూడా ముక్కునుంచి రక్తం కారుతుంది. ఈ సమస్య చాలాసార్లు దానంతట అదే ఆగిపోతుంది. చాలాసేపటి వరకూ ఆగకపోతే రక్తం కారుతున్న వైపు ముక్కును బొటనవేలితో ఐదు నిమిషాలపాటు నొక్కి మూసేయాలి.
తల కొంచెం ముందుకు వంచడం వల్ల రక్తం నోట్లోకి వెళ్లకుండా ఆపవచ్చు. ముక్కులోకి మంచును పీల్చడం, ముక్కు చుట్టూ ఐస్‌ప్యాక్ ఉంచడం, నోటితో గాలి పీల్చడం.. తదితర ఉపశమన చర్యలతో రక్తస్రావాన్ని ఆపవచ్చు. అయినా ఆగకపోతే వైద్యుడిని సంప్రదించాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లగా ఉంచడం, ముక్కులో సలైస్ డ్రాప్స్ వేయడం, పిల్లల గోళ్లు పెరగకుండా తరచూ కత్తిరించడం.. ఈ సమస్యను అడ్డుకునే మార్గాలు.
-డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్.