Potatoes For Skin And Hair | ఆలుగడ్డలతో మనం తరచూ అనేక రకాల వంటలను చేస్తుంటాం. కొందరు ఆలుగడ్డలను వేపుడు చేసి తింటే కొందరు టమాటాలతో వండి తింటారు. ఇంకా కొందరు బిర్యానీ వంటి వంటకాల్లో వేస్తుంటారు. కొందరు వీటితో చిప్స్ చేస్తారు. ఆలుగడ్డలు ఎంతో రుచిగా ఉండడమే కాదు, అనేక పోషకాలను సైతం అందిస్తాయి. అయితే వీటిని సరిగ్గా ఉపయోగించాలే కానీ అనేక చిట్కాలను వీటితో మనం పాటించవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆలుగడ్డలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వారు అంటున్నారు. ఆలుగడ్డల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, బి6, పొటాషియం, పలు రకాల ఎంజైమ్‌లు మనకు ఆలుగడ్డలను తినడం వల్ల లభిస్తాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆలుగడ్డలను ఉపయోగించి పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. ఇక ఆలుగడ్డలతో ఎలాంటి చిట్కాలను పాటించవచ్చు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించడంలో ఆలుగడ్డలు ఎంతో బాగా పనిచేస్తాయి. ఆలుగడ్డల్లో కాటెకోలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఆలుగడ్డల్లో కూలింగ్ లక్షణాలు ఉంటాయి. కనుక చర్మానికి మేలు జరుగుతుంది. కళ్ల కింద ఏర్పడే వాపులు, నల్లని వలయాలు సైతం తగ్గిపోతాయి. ఇందుకు ఆలుగడ్డలను ఎలా ఉపయోగించాలంటే.. ఆలుగడ్డలను సన్నగా గుండ్రంగా చక్రాల్లా కట్ చేయాలి. వీటిని నేరుగా డార్క్ సర్కిల్స్ మీద పెట్టాలి. లేదా ఆలుగడ్డ జ్యూస్‌లో కాటన్ ప్యాడ్స్‌ను ముంచి వాటిని కూడా కళ్ల కింద పెట్టుకోవచ్చు. ఇలా 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్, వాపులు తగ్గిపోతాయి. కళ్లు అందంగా కనిపిస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు సైతం పోతాయి.
ఎండ వల్ల కందిన చర్మానికి సైతం ఆలుగడ్డలు ఎంతగానో మేలు చేస్తాయి. ఆలుగడ్డల్లో ఉండే స్టార్చ్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకంగా పనిచేస్తుంది. ఆలుగడ్డల్లో అధికంగా ఉండే నీరు చల్లదనాన్ని అందిస్తుంది. ఆలుగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నేరుగా కందిపోయిన చర్మంపై పెట్టుకోవచ్చు. లేదా ఆ భాగంలో ఆలుగడ్డల నుంచి తీసిన రసాన్ని కూడా రాయవచ్చు. తరువాత 15 నిమిషాలు ఆగి కడిగేయాల్సి ఉంటుంది. ఇలా తరచూ చేస్తుంటే ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. చిన్నపాటి కాలిన గాయాలకు కూడా ఈ చిట్కా బాగానే పనిచేస్తుంది. ఇలా చేస్తే చర్మానికి చల్లదనం లభిస్తుంది. వెంటనే నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలిన గాయం కూడా త్వరగా మానుతుంది.
ఆలుగడ్డలను ఉపయోగించి పులిపిర్ల సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. ఆలుగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కను తీసుకుని పులిపిర్లపై పెట్టాలి. దానిపై బ్యాండేజ్ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం తీసేయాలి. ఇలా చేస్తుంటే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలకు కూడా ఆలుగడ్డలను ఇలాగే ఉపయోగించవచ్చు. ఆలుగడ్డల నుంచి రసం తీసి వాడుకోవచ్చు. లేదా నేరుగా ఆలుగడ్డ ముక్కలను సంబంధిత భాగంపై పెట్టవచ్చు. ఇలా తరచూ చేస్తుంటే ఉపయోగం ఉంటుంది. ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలోనూ ఆలుగడ్డ పనిచేస్తుంది. ఆలుగడ్డ జ్యూస్‌లో కొద్దిగా కలబంద రసం లేదా తేనె కలిపి హెయిర్ ప్యాక్ రెడీ చేయాలి. దీన్ని జుట్టుకు బాగా రాసి 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇలా ఆలుగడ్డలను మనం పలు చర్మ సమస్యలతోపాటు శిరోజాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.