Good Habits | నిద్ర లోపం గట్ (జీర్ణ వ్యవస్థ) బ్యాక్టీరియా సమతౌల్యాన్ని దెబ్బతీస్తూ, రక్తంలో చక్కెర నియంత్రణను క్షీణింపజేసి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ను (వాపు) పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు దాటిన తరువాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జీవనశైలి అలవాట్లు అనుసరించడం అత్యంత అవసరమని వారు సూచిస్తున్నారు. అలాగే 40 ఏళ్ల వయస్సులో ఆరోగ్యంగా ఉండటానికి పాటించే 7 ముఖ్య అలవాట్లను కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. చిన్నచిన్న మార్పులు కూడా దీర్ఘకాల ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయని, ఈ అలవాట్లను దినచర్యలో భాగంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మొదటగా, సరైన నిద్రను అత్యంత ప్రాధాన్యమైన అంశంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం ద్వారా గట్ బ్యాక్టీరియా సమతౌల్యం మెరుగుపడి, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే రోజువారీ శారీరక చలనం కూడా ఎంతో కీలకం. ప్రతి రోజు నడక, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, అలాగే సరిపడా ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాల ఆరోగ్యానికి కండరాల బలం ముఖ్య సూచికగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా అవసరం. బీన్స్, కూరగాయలు, బెర్రీస్, విత్తనాలు వంటి ఆహారాలు గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చాలామంది అవసరమైన ఫైబర్ పరిమాణంలో సగం మాత్రమే తీసుకుంటున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఫెర్మెంటెడ్ (పులిసిన) ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగు, కెఫిర్, కిమ్చీ, సావర్క్రౌట్ వంటి ఆహారాలు గట్ మైక్రోబయోమ్‌ను (మంచి బ్యాక్టీరియా) బలోపేతం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అంతేకాకుండా అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం కూడా ఆరోగ్యానికి ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా నివారించడం కష్టమైనప్పటికీ, ఎక్కువగా సహజమైన, పూర్తి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటితోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించడం కూడా అత్యంత అవసరం. దీర్ఘకాలిక ఒత్తిడి జీర్ణక్రియను మందగించి, గట్-బ్రెయిన్ సంబంధాన్ని దెబ్బతీస్తుందని, ధ్యానం వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగమే. జీవితాంతం నేర్చుకునే తత్వం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 30ల నుంచే ఈ అలవాట్లను ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న రోజువారీ మార్పులు గట్ ఆరోగ్యం, మెటాబాలిజం, దీర్ఘకాల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయని వారు స్పష్టం చేస్తున్నారు.