Medical Tests | తీవ్ర ఆరోగ్య సంక్షోభం తలెత్తే వరకు అనారోగ్య సమస్యలు చాలా వరకు గుర్తించబడవు. 30 ఏళ్లు పైబడిన తరువాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా అవసరం. ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించడం వల్ల చికిత్స తీసుకోవడం సులభతరం అవుతుంది. 30 ఏళ్లు దాటిన తరువాత గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉంది. వీటిని ముందుగానే గుర్తించడం, నివారించడం కోసం వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు చేయించుకోవాల్సిన ఆరోగ్యపరీక్షల వివరాల గురించి తెలుసుకుందాం.
30 ఏళ్లు పైబడిన వారు చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షల్లో రక్తపోటు కూడా ఒకటి. ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తుంది. 120/80 ఎమ్ఎమ్ హెచ్‌జి కంటే ఎక్కువ వచ్చే రీడింగ్ లు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల పనితీరు దెబ్బతినేలా చేస్తాయి. కనుక ముందునుండే రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. వ్యాయామాలు చేస్తూ ఒత్తిడిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో దీర్ఘకాలం పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు, ట్రైగ్లిజరాయిడ్స్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయి. కనుక ముందు నుండే రక్తపరీక్షలు చేయించుకుంటూ చక్కటి ఆహారాన్నితీసుకునే ప్రయత్నం చేయాలి. ఓట్స్, మెంతులు వంటివి ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని మనం ముందు నుండే తగ్గించుకోవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ కోసం హెచ్‌బిఎ1సి పరీక్షలు చేయించుకోవడం మంచిది. హెచ్‌బిఎ1సి స్థాయిలు 5.7 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఇది ఇన్సులిన్ నిరోధకతను సూచిస్తుంది. దీనిని ముందుగానే నిర్దారించడం వల్ల ఆహారం, వ్యాయామాలతో దీనిని తిప్పికొట్టవచ్చు. కాకరకాయ, దాల్చిన చెక్క వంటి వాటిని తీసుకుంటూ యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల, ఆహార నియంత్రణ పాటించడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుచుకోవచ్చు. డయాబెటిస్ ను ముందుగానే గుర్తించకపోవడం వల్ల న్యూరోపతి, రెటినోపతి, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక డయాబెటిస్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం.
30 నుండి 65 పంవత్సరాల వయసు ఉన్న మహిళలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలి లేదా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి పరీక్ష చేయించుకోవాలి. దీని ద్వారా గర్భాశయ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చు. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చర్మంపై యువీ కిరణాలు ఎక్కువగా పడడం వల్ల మెలనోమా ప్రమాదం పెరుగుతుంది. చర్మంపై అసమాన, క్రమరహిత, వివిధ రంగుల్లో 6 మిమీ కంటే ఎక్కువ పరిమాణం చెందుతున్న గాయాలు చర్మ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి సహాయపడతాయి. సన్ స్క్రీన్ ను ఉపయోగించడం, రక్షణ దుస్తులను ధరించడం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ ను నిరోధించవచ్చు.
ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల గ్లాకోమా, కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. వయసుతో పాటు కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. కంటి పరీక్షల ద్వారా డయాబెటిస్, రక్తపోటు ప్రారంభాన్ని కూడా గుర్తించవచ్చు. ప్రతి సంవత్సరం దంతాలను పరీక్షించుకోవడం కూడా చాలా అవసరం. నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో ముడిపడి ఉన్న ప్లేక్ నిర్మాణం , చిగుళ్ల వాపును పరిష్కరించుకోవచ్చు. పీరియాంటైటిస్ నుండి వచ్చే బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి అథెరోస్క్లెరోసిస్ ను తీవ్రతరం చేస్తుంది. ఎక్స్ రే కిరణాలు దాగి ఉన్న బ్యాక్టీరియాను, ఎముకల నష్టాన్ని వెల్లడిస్తాయి. కనుక దంత పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం. బ్యాక్టీరియాను తగ్గించడానికి రోజూ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పుల్లింగ్ చేస్తూ ఉండాలి.
టిఎస్హెచ్, టి3, టి4 రక్తపరీక్షలు చేయించుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం, ఆందోళన, గుండెదడ వంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక థైరాయిడ్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం. ఈ విధంగా ప్రతి సంవత్సరం పైన చెప్పిన పరీక్షలు చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. దీంతో ఆయా సమస్యలు మరింత తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.